Abhishek Sharma IND VS ENG T20 : తొలి టీ20లో విజయం సాధించిన టీమ్ఇండియా ఇప్పుడు రెండో మ్యాచ్‌లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా శనివారం భారత్, ఇంగ్లండ్ జట్ల రెండో టీ20 కోసం పోటీ జరగనుంది. అయితే ఇప్పటివరకూ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ బలంగా ఉన్న టీమ్ఇండియాకు రెండో టీ20 కోసం తుది జట్టును ఎంపిక చేయడం పెద్ద సమస్యగా మారింది. పేసర్‌గా షమీని ఆడిస్తారా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాని నేపథ్యంలో ఓ వార్త అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.
తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సెషన్ సమయంలో చీలమండ గాయం కారణంగా అతడు బాధపడినట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఒకవేళ అది గనుక నిజమైతే అభిషేక్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
షమీ కన్ఫార్మేనా!
ఇదిలా ఉండగా, అభిషేక్ గైర్హాజరీలో అతడి స్థానంలో ఓపెనర్‌గా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారనుంది. సంజు శాంసన్, అభిషేక్‌కు బ్యాకప్ ఓపెనర్ ఎవరూ లేకపోవడం వల్ల ఇప్పుడు అతడి స్థానంలో సూర్యకుమార్ ఓపెనర్‌గా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని క్రిటిక్స్ అంటున్నారు.
ఇక రెండో టీ20లో షమీ ఎంట్రీ ఖాయమేనన్న వార్తలూ వస్తున్నాయి. మొదటి మ్యాచ్ బరిలోకి దిగిన నితీశ్ రెడ్డి బ్యాటింగ్, బౌలింగ్ చేయలేదు. దీంతో తన ప్లేస్‌లో షమీని తుది జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అభిషేక్ దూరమైతే షమీ, నితీశ్ తుది జట్టులో ఉండొచ్చని అంటున్నారు. అయితే కొత్త బంతితో హార్దిక్ భారీగానే పరుగులు ఇచ్చాడు. దీంతో అర్ష్‌దీప్‌తో కలిసి తొలి స్పెల్‌ను షమీ వేస్తే ఇంగ్లండ్‌ను ఇంకా కట్టడి చేయొచ్చు.
మరోవైపు చెపాక్ స్టేడియం స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని క్రిటిక్స్ అంటున్నారు. ఆ సమయంలో నితీశ్‌ను పక్కనపెట్టి వాషింగ్టన్ సుందర్‌ను ఆడిస్తారనేది క్రికెట్ విశ్లేషకుల అంచనా. అలాగైతే ఎక్స్ట్రా బ్యాటర్ కూడా జట్టులో ఉన్నట్లు అవుతుంది. అయితే బ్యాటింగ్ కూడా అవసరమే. సుందర్‌తో పాటు నితీశ్‌ను కూడా తుది జట్టులోకి తీసుకుంటే అప్పుడు ఎనిమిది మంది బ్యాటర్లు అందుబాటులో ఉన్నట్లు అవుతారు. దీంతో రవి బిష్ణోయ్‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది.
తుది జట్టు (అంచనా)
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్య, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్/రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, సంజు శాంసన్, మహ్మద్ షమీ.
ఇంగ్లాండ్‌తో రెండో T20- చెపాక్‌లోనూ చెక్ పెట్టేందుకు ప్లాన్
'చాహల్ నన్ను క్షమించు, అలా చేసినందుకు సారీ!'- టీమ్ఇండియా స్టార్ ప్లేయర్