Pakistan Cricketer In IPL:2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (17వ సీజన్) మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు అన్ని దేశాల ప్లేయర్లు ఈ టోర్నీలో ఆడేందుకు బీసీసీఐ అవకాశం కల్పించింది. ప్రతిభ ఉంటే చాలు ఐపీఎల్‌లో అవకాశాలుంటాయని స్పష్టం చేసింది. అయితే ప్రారంభమైన ఏడాదికే ఈ విషయంలో బీసీసీఐ నిబంధనలు కఠినం చేసింది. కొన్నేళ్లుగా దాయాది దేశం పాకిస్థాన్ ప్లేయర్లకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేకుండా వారిపై నిషేధం విధించింది. అయితే వాస్తవానికి తొలి సీజన్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు.
కానీ, 2008 ముంబయి ఉగ్రదాడుల తర్వాత ఐపీఎల్‌లో ఆడకుండా పాకిస్థాన్ ఆటగాళ్లపై భారత్ నిషేధం విధించింది. అప్పట్నుంచి పాక్ ప్లేయర్లు ఐపీఎల్‌లో ఆడడం లేదు. కానీ, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. నిషేధం తర్వాత కూడా పాక్‌లో పుట్టిన కొందరు ఆటగాళ్లు ఐపీఎల్ ఆడారు. అది ఎలా సాధ్యమైందంటే? ఐపీఎల్‌లో ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్లకు రెండు దేశాల పౌరసత్వం ఉండటమే కారణం. పాక్‌లో పుట్టినప్పటికీ వాళ్లు ఇతర దేశాలకు వలస వెళ్లి అక్కడి దేశం పౌరసత్వం పొందడం వల్ల ఆయా ప్లేయర్లకు ఐపీఎల్‌లో ఆడే ఛాన్స్ వచ్చింది. అలా ఇప్పటివరకు ఎలాంటి వివాదం లేకుండా ఐపీఎల్‌లో ఆడుతున్న క్రికెటర్లు (Pakistan Born Players) ఎవరంటే?
- అజర్ మహ్మద్: 2011లో పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అజహర్ మహ్మద్ బ్రిటీష్ పౌరసత్వం పొందడం వల్ల ఐపీఎల్ ఛాన్స్ వచ్చింది. 2012 వేలంలో కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లలో 186 పరుగులు చేశాడు, 14 వికెట్లు సాధించాడు. 2013 సీజన్‌లో 11 మ్యాచ్‌లలో 15 వికెట్లు తీశాడు. 2014లో పంజాబ్ వదిలేయడం వల్ల ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 2015లోనూ అదే పరిస్థితి ఎదురైంది. అయితే టోర్నమెంట్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు, గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి జేమ్స్ నీషమ్ వైదొలగడంతో కేకేఆర్ అజర్ మహ్మద్‌ని ఎంచుకుంది. చివరి సీజన్‌లో ఒక మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం లభించింది.
- ఒవైస్ షా:ఒవైస్ షా 2001-09 వరకు ఇంగ్లండ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. కరాచీలో జన్మించిన ఇంగ్లాండ్ ఆటగాడు షా, 2010లో కోల్‌కతా నైట్ రైడర్స్ (kkr)తో చేరాడు. తొలి ఐపీఎల్ సీజన్‌లో, ఐదు మ్యాచ్‌లలో 115 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత 2011లో టస్కర్స్ కేరళ (KTK) తరఫున ఆడాడు. ఈ సీజన్‌లో పెద్దగా రాణించలేదు. 2012లో, రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున 13 మ్యాచ్‌లలో 340 పరుగులు చేశాడు. 2013లో చివరిసారిగా RR తరఫున రెండు మ్యాచ్‌లు ఆడి, 25 పరుగులు మాత్రమే చేశాడు.
- ఇమ్రాన్ తాహిర్: పాకిస్థాన్ లాహోర్‌లో జన్మించిన ఇమ్రాన్ తాహిర్, ఆ దేశ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే 2011 ప్రపంచకప్‌కు ముందు, తాహిర్ సౌతాఫ్రికా పౌరసత్వం పొందాడు. ఐపీఎల్ 2014లో దిల్లీ క్యాపిటల్స్ (అప్పటి దిల్లీ డేర్‌డెవిల్స్) తరఫున అవకాశం అందుకున్నాడు. ఆరు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. 2018 నుంచి 2021 వరకు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడాడు. నాలుగు సీజన్లు ఆడిన తాహిర్ 27 మ్యాచ్‌లలో, మొత్తం 35 వికెట్లు పడగొట్టాడు. 2019 ఎడిషన్‌లో అతని 4/12 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
- ఉస్మాన్ ఖవాజా: ఉస్మాన్ ఖవాజా, ఇస్లామాబాద్‌లో జన్మించాడు. కానీ, కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. 2016లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ (RPS) ఖవాజాను కొనుగోలు చేసింది. ఖవాజా ఆరు మ్యాచ్‌లలో కేవలం 127 పరుగులు చేశాడు. 2017లో కూడా ఖవాజా RPSలో ఉన్నాడు, కానీ ఒక్క గేమ్ కూడా ఆడలేదు.
- అలీ ఖాన్: పాకిస్థాన్‌లో జన్మించిన అలీ ఖాన్‌కు USA పౌరసత్వం ఉంజి. దీంతో అతడికి ఐపీఎల్ ఆడే ఛాన్స్ వచ్చింది. అలీ ఖాన్ 2020లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున ఆడే అవకాశం వచ్చింది. దురదృష్టవశాత్తూ ఐపీఎల్ మొదలుకాక ముందే, గాయం కారణంగా వైదొలిగాడు.
- సికందర్ రజా: పాకిస్థాన్‌కు చెందిన జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ (PBKS) తరఫున అరంగేట్రం చేశాడు. సికందర్ రజా పాక్‌లోని సియాల్‌కోట్‌లో జన్మించాడు. PBKS తరఫున ఏడు మ్యాచ్‌లలో 139 పరుగులు చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసి మూడు వికెట్లు కూడా తీశాడు.