Virat Kohli Ranji Trophy : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఇటీవలే జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ పరుగుల చేయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక సూచన చేశాడు.
ఈ ఏడాది జూన్ నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ముందు కోహ్లీ యూకేలో జరిగే కౌంటీ క్రికెట్ ఆడాలని మంజ్రేకర్ సూచించాడు. కోహ్లీ మునుపటి ఫామ్‌ను అందుకునేందుకు ఎక్కువగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లిష్ గడ్డపై రాణించేందుకు కోహ్లీ కూడా ఛెతేశ్వర్ పుజారాలా కౌంటీ క్రికెట్ సీజన్లో ఆడటం గురించి ఆలోచించాలని పేర్కొన్నాడు.
"ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆ జట్టుతో భారత్ తొలి టెస్టును జూన్ లో ఆడనుంది. ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్ షిప్ ఏప్రిల్ లో ప్రారంభమవుతుంది. పుజారాలా కోహ్లీ కూడా కౌంటీ క్రికెట్ ఆడాలి. అప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై మంచి ప్రాక్టీస్ లభిస్తుంది. కోహ్లీ అక్కడికి వెళ్లి కష్టపడాలి. కౌంటీ క్రికెట్ ఆడటం కోహ్లీకి అవసరం. అది తెలివైన పని కూడా." అని మంజ్రేకర్ ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించాడు.
కోహ్లీకి మద్దతుగా బంగర్
మరోవైపు, పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న కోహ్లీకి భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ మద్దతుగా నిలిచాడు. కోహ్లీ మంచి ఫిట్నెస్తో ఉన్నాడని, అతడు మరికొన్నేళ్లు క్రికెట్ ఆడొచ్చని అభిప్రాయపడ్డాడు. "నేను ఇప్పటికీ కోహ్లీకి మద్దతు ఇస్తున్నాను. 36 ఏళ్ల వయసులో కూడా అతను ఎప్పటిలాగే ఫిట్‌గా ఉన్నాడు. అతని ఫిట్నెస్ స్థాయిలు అద్భుతంగా ఉన్నాయి." అని బంగర్ అన్నాడు.
రంజీ జట్టులో చోటు
మ్యాచ్ ఆడతాడో లేదో కానీ దిల్లీ రంజీ జట్టులో మాత్రం టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరును చేర్చింది ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం. 22 మంది ప్రాబబుల్స్ లో కోహ్లీకి చోటు దక్కింది. ఈ నెల 23 నుంచి రంజీ ట్రోఫీ తర్వాతి రౌండ్ మ్యాచ్ లు మొదలవుతాయి. ఈ మ్యాచ్ ల్లో కోహ్లీ ఆడుతాడో లేదో చూడాలి. కాగా, కోహ్లీ చివరిసారిగా 13ఏళ్ల క్రితం 2012లో దిల్లీ తరపున రంజీ ట్రోఫీ ఆడాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర వైఫల్యం నేపథ్యంలో రోహిత్, కోహ్లీ సహా స్టార్ బ్యాటర్లందరూ దేశవాళీల బాట పట్టాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ రంజీల్లో ఆడుతాడో లేదో చూడాలి.
ఘోర విఫలం
గతేడాది 10 టెస్టుల్లో విరాట్ కోహ్లీ 24.52 సగటుతో కేవలం 417 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక శతకం, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఓవరాల్ గా అన్ని ఫార్మాట్లలో కలిపి గతేడాది 32 ఇన్నింగ్స్ ల్లో 21.83 సగటుతో కేవలం 655 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు.
ఫ్యాన్స్‌కు షాక్- విరాట్ కోహ్లీకి గాయం- ఆ టోర్నీకి కష్టమే!
ఆస్ట్రేలియా టూర్ ఎఫెక్ట్ - 'యో యో' టెస్ట్ ఈజ్ బ్యాక్! - ప్లేయర్లను రాటు తేల్చేందుకు విరాట్ రూల్!