Pakistan T20 World Cup:2024 టీ20 వరల్డ్‌కప్ ఓటమితో పాకిస్థాన్ జట్టు ప్లేయర్లపై అనేక విమర్శలు వస్తున్నాయి. పొట్టికప్‌లో పాక్ ఆటతీరు బాగా లేదని స్వయంగా పలువురు పాక్ మాజీ క్రికెటర్లే అభిప్రాయలు వ్యక్తపరిచారు. జట్టులోని సీనియర్ క్రికెటర్లను తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే 2022 టీ20 వరల్డ్‌కప్ ఓటమి తర్వాత పాక్ క్రికెట్ బోర్డులో మార్పులు జరిగాయి. అప్పట్నుంచి బోర్డుకు ముగ్గురు ఛైర్మన్లు మారారు. పలువురు కోచ్‌ల మార్పు కూడా జరిగింది.
ఈ నేపథ్యంలో మరోసారి పాక్ క్రికెట్లో భారీ మార్పులు చేయాలని బోర్డు భావిస్తున్నాట్లు తెలుస్తోంది. అయితే ఈసారి బోర్డు ప్లేయర్ల పట్ల కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని టాక్. ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన చేసిన సీనియర్ ఆటగాళ్లను మళ్లీ సెంట్రల్ కాంట్రాక్టుల్లోకి తీసుకునేందుకు పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సుముఖంగా లేడన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సీనియర్ ఆటగాళ్లపై వేటు తప్పే పరిస్థితి లేనట్లు కనిపిస్తోంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లను కలిగి ఉన్న ఆటగాళ్ల సంఖ్యను తగ్గించే అవకాశం ఉందని, లేదా పూర్తిగా తొలగించవచ్చని బోర్డు వర్గాలు చెప్పినట్లు సమాచారం. ఇక ఆటగాళ్లకు లభించే ఇతర ప్రోత్సాహకాలను కూడా ఓసారి పరిశీలించాలని పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరుస పేలవమైన ప్రదర్శనల కారణంగానే పీసీబీ ఈ చర్యలు తీసుకోనుంది.