Novak Djokovic Australian Open 2025 : సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌ను గాయం ఇబ్బంది పెట్టింది. దీంతో కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్‌ను నెగ్గాలనే లక్ష్యం నిరాశగానే మిగిలింది. తాజాగా జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో జరిగిన ఈ ఘటన జకోవిచ్ అభిమానులను కలచివేసింది. తాజాగా జరిగిన సెమీస్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్ తర్వాత జకోవిచ్ వాకోవర్ ఇచ్చేశాడు. అయితే గాయం కారణంగానే అతడు ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్లు వెల్లడించి, తన అభిమానులకు అభివాదం చేస్తూనే కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయాడు.
జకోవిచ్ చేసిన ఈ పనితో స్టేడియంలోని వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే జకోవిచ్ వైదొలగడం వల్ల జర్మనీ స్టార్ జ్వెరెవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరగనున్న రెండో సెమీస్‌లో విజేతగా నిలవనున్న ప్లేయర్‌తో జ్వెరెవ్ టైటిల్ కోసం పోరాడనున్నాడు.
ఇక ఇటలీకి చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ సినర్‌తో అమెరికా స్టార్ బెన్ షెల్టన్ మరో సెమీస్‌లో తలపడనున్నాడు. ఆదివారం ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ జరగనుంది.