MS Dhoni Ind vs Pak 2025 :భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఈ మెగా మ్యాచ్కు కోట్లలో వ్యూయర్ షిప్ ఉంటుంది. క్రికెట్ లవర్స్ టీవీలకు అతుక్కుపోతుంటారు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ కూడా లైవ్ మ్యాచ్ చూస్తున్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. బాలీవుడ్ స్టార్ సన్నీ దేఓల్తో ధోనీ టీవీలో మ్యాచ్ను వీక్షిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
షూటింగ్కు బ్రేక్
ప్రస్తుతం ధోనీ ఏదో యాడ్ షూటింగ్ చేస్తున్నాడు. అయితే ఆదివారం మ్యాచ్ ఉండడం వల్ల షూటింగ్కు సమయంలో బ్రేక్ ఇచ్చి మరీ లైవ్ మ్యాచ్ చూస్తున్నాడు. ఈ ఫొటోల్లో ధోనీ ఎల్లో కలర్ జెర్సీ ధరించి ఉన్నాడు. అంటే ఐపీఎల్ రానున్న నేపథ్యంలో ధోనీ సీఎస్కేకు సంబంధించిన యాడ్లో చేస్తున్నట్లు ఉన్నాడని అర్థం అవుతోంది. ఎల్లో జెర్సీలో కొత్త హెయిర్ స్టైల్లో 'తలా' అదిరిపోయాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ధోనీతో పాటు బాలీవుడ్ నటుడు సన్నీ దేఓల్ కూడా మ్యాచ్ చూస్తున్నాడు. ధోనీతో సన్నీ ఏదో చర్చిస్తున్న వీడియోలను ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు.
స్టేడియంలో బుమ్రా, అభిషేక్. తిలక్ సందడి
ఈ మ్యాచ్కు స్టార్ పేసర్ బుమ్రా సడెన్గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే బుమ్రా వచ్చింది బరిలోకి దిగేందుకు కాదు, మ్యాచ్ చూడడానికి. బుమ్రాతోపాటు టీమ్ఇండియా యంగ్ ప్లేయర్లు నితీశ్ రెడ్డి, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా స్టేడియంలో మెరిశారు. సీనియర్లు ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్ స్పెషల్ గెస్ట్లుగా వచ్చి, టీమ్ఇండియాను ఎంకరేజ్ చేశారు.