Mohammed Shami Border Gavaskar Trophy : టీమ్ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. గతేడాది వన్డే ప్రపంచ కప్ తర్వాత క్రికెట్‌కు దూరమైన షమీ, ఆ తర్వాత మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నాడు. అయితే పూర్తిగా కోలుకుంటున్న సమయంలో మళ్లీ ఆ గాయం తిరగబెట్టింది. దీంతో క్రీడాభిమానులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే భారత స్క్వాడ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు షమీని సెలెక్ట్ చేయలేదు. కానీ అతడ్ని జట్టులోకి తీసుకొనే అవకాశం ఉందన్న వార్తలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే అలా జరగాలంటే మాత్రం ఓ కండీషన్‌కు షమీ ఓకే చెప్పాల్సి ఉంటుందని క్రికెట్ వర్గాల మాట.
"షమీని ఈ సారి సెలెక్ట్ చేయలేదు. కానీ, ఆసీస్ పర్యటన మొదలయ్యేలోపు అతడ్ని జట్టులోకి ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. అప్పటిలోపు షమీ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. రంజీ ట్రోఫీలో ఆడితే మళ్లీ బౌలింగ్‌లో రిథమ్‌ను అందుకోవచ్చు. బెంగాల్ తరఫున నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఆడతాడని సమాచారం. నవంబర్ తొలి వారం నాటికి ఫిట్‌నెస్ నిరూపించుకోగలిగితే చాలు" అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.