Mike Tyson vs Jake Paul 2024 :58 ఏళ్ల బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ మెగా ఫైట్ ఓటమిపై తాజాగా స్పందించాడు. తనకంటే చాలా చిన్నవాడైన 27ఏళ్ల జేక్ పాల్ చేతిలో మ్యాచ్ ఓడినందుకు ఏమాత్రం బాధ లేదని మైక్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ, ఇటీవల మరణం అంచుల దాకా వెళ్లి అక్కడ విజయం సాధించినట్లు తెలిపాడు. ఈ మేరకు మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు.
'మనం ఓటమిలో కూడా విజయాన్ని చూసుకునే సందర్భం ఇది. గత రాత్రికి కృతజ్ఞతలు చెబుతున్నా. చివరి సారిగా బాక్సింగ్ రింగ్‌లోకి వచ్చినందుకు ఏ మాత్రం బాధపడటంలేదు. ఈ ఏడాది జూన్‌లో మరణం అంచుల వరకూ వెళ్లొచ్చాను. నాకు 8 సార్లు రక్తమార్పిడి చేశారు. దాదాపు 12 కిలోల బరువు, సగానికిపైగా రక్తాన్ని కోల్పోయాను. తిరిగి ఆరోగ్యంగా ఫైట్ చేయడం కోసం పోరాడాల్సి వచ్చింది. అయితే దీనిలో మాత్రం నేను విజయం సాధించాను. డల్లాస్‌లో ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి కౌబాయ్ స్టేడియంలో నా వయసులో సగం ఉన్న ఓ టాలెంటెడ్ యువకుడితో ఉత్సాహంగా మునివేళ్లపై కదులుతూ, నేను చేసిన 8 రౌండ్ల పోరాటాన్ని నా పిల్లలు చూశారు' అని పేర్కొన్నాడు.
మరోవైపు మ్యాచ్ విజేత జేక్ పాల్ కూడా స్పందించాడు. ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. 'రికార్డులు బద్దలయ్యాయి. లవ్ యూ మైక్. నంబర్లు తప్పు చెప్పవు. త్వరలోనే ప్రకటన వెలువడుతుంది' జేక్ అని పేర్కొన్నాడు.