MI vs CSK IPL 2024:2024 ఐపీఎల్లో భాగంగా ఆదివారం స్టార్ జట్లు ముంబయి ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ తలపడగా ఈ హై వోల్టేజ్ మ్యాచులో సీఎస్కే గెలిచింది. 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఛేదనలో ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసింది. రోహిత్ శర్మ (105 నాటౌట్; 63 బంతుల్లో 11×4, 5×6) వీరోచిత పోరాటం వృథా అయింది. పతిరన (4/28) ముంబయిని దెబ్బకొట్టాడు.
మొదట ఈ భారీ లక్ష్య ఛేదనను ముంబయి ఘనంగా ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ (23 పరుగులు, 15 బంతుల్లో) బౌండరీలతో చెన్నై బౌలర్లపై దాడికి దిగారు. వీరి ధాటికి ముంబయి 5 ఓవర్లకే 50 స్కోర్ దాటింది. ఇక జోరు మీదున్న ముంబయికి యంగ్ పేసర్ మతీషా పతిరణ కళ్లెం వేశాడు. ఓకే ఓవర్లో ఇషాన్, సూర్యకుమార్ యాదవ్ (0)ను పెవిలియన్ చేర్చి చెన్నైకి బ్రేక్ ఇచ్చాడు.
రెండు వికెట్లు కోల్పోయినా, రోహిత్ దూకుడు తగ్గించలేదు. ఈ క్రమంలోనే జడేజా ఓవర్లో ఫోర్ బాది 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫిఫ్టీ తర్వాత కూడా రోహిత్ ఫోర్లు, సిక్స్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. మరోవైపు యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ (31 పరుగులు, 19 బంతుల్లో) సైతం మెరుపులు మెరిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 31 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే పతిరన 14వ ఓవర్లో తిలక్‌ను ఔట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల సాధించాల్సిన రన్‌రేట్ బాగా పెరిగిపోయింది. చివరికి ముంబయి లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. రోహిత్ ఒక్కడే సెంచరీతో ముంబయి అభిమానులు అలరించాడు.
అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్ అజింక్యా రహానే (6), రచిన్ రవీంద్ర (21 పరుగులు) విఫలమయ్యారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (69 పరుగులు), శివమ్ దూబే (66* పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు. చివర్లో డారిల్ మిచెల్ (17 పరుగుల) ఫర్వాలేదనిపించాడు.