Marnus Labuschagne Fielding Set :ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మార్నస్ లబూషేన్ క్రికెట్లో విచిత్రమైన ఫీల్డింగ్ సెట్ చేసి వార్తల్లో నిలిచాడు. ప్లేయర్‌ను సరిగ్గా అంపైర్ వెనకాల ఫీల్డింగ్‌కు సెట్ చేశాడు. అది చూసి అంపైర్ సైతం ఆశ్చర్యపోయాడు. దీంతో కాసేపు మైదానంలో సరదా వాతావరణం నెలకొంది. లబుషేన్ ఫీల్డింగ్ సెటప్ చూసి అందరూ నవ్వుకున్నారు. వెంటనే ఫీల్డర్ పొజిషన్ కాస్త పక్కకు మార్చి బౌలింగ్ కొనసాగించాడు. ఆస్ట్రేలియా డొమెస్టిక్ లీగ్ షెఫీల్డ్ షీల్డ్ (Sheffield Shield Cricket) టోర్నీలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆసీస్ డొమెస్టిక్ లీగ్ క్వీన్స్‌ల్యాండ్- వెస్టర్న్ ఆస్ట్రేలియా (Queensland Bulls vs Western Australia) మధ్య మ్యాచ్ జరుగుతోంది. క్వీన్స్‌ల్యాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మార్నస్ లబుషేన్ తొలి రోజు ఆటలో 66 వ ఓవర్ బౌలింగ్ చేయడానికి బంతి అందుకున్నాడు. ఇక తన టీమ్‌మేట్స్‌లో ఒక ప్లేయర్‌ను పిలిచి, సరిగ్గా అంపైర్ వెనకాల ఫీల్డింగ్‌కు పెట్టాడు. అది మిడ్ ఆన్ లేదా మిడ్ ఆఫ్ రెండిట్లో ఏ పొజిషన్ కూడా కాదు. అంపైర్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూగానే సర్ప్రైజ్ అయ్యాడు. కాసేపు గ్రౌండ్లో ఆడియెన్స్‌తోపాటు ప్లేయర్లూ నవ్వుకున్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం లబుషేన్ వెరీ ఫన్నీ అంటుూ కామెంట్లు పెడుతున్నారు. 'బహుశా క్రికెట్లో ఇలాంటి ఫీల్డింగ్ ఎవరు సెట్ చేయలేదేమో', 'లబుషేన్ ఇది గల్లీ క్రికెట్ అనుకుంటున్నాడు' అని ఫన్నీగా స్పందిస్తున్నారు.