Manu Bhaker Khel Ratna Controversy :2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలతో అదరగొట్టిన భారత షూటింగ్ స్టార్ మను భాకర్ చుట్టూ ఓ వివాదం నెలకొంది. ప్రతిష్ఠాత్మక ఖేల్ రత్న అవార్డు నామినేషన్ల నుంచి ఆమెను మినహాయించారని కొన్ని నివేదికలు రావడంతో అసలు చర్చ మొదలైంది. చాలా మంది ఒలింపిక్ పతక విజేతకు తగిన గౌరవం ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేశారు. అయితే జాతీయ క్రీడా అవార్డుల తుది జాబితాను ఇంకా ఖరారు చేయలేదని యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఓ వార్తా సంస్థ నివేదిక ప్రకారం, క్రీడా అవార్డుల నామినేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు ఏ ఆటగాడిని మినహాయించలేదని తెలుస్తోంది.
నిరాశ వ్యక్తం చేసిన మను భాకర్ తండ్రి
అంతకుముందు మను భాకర్ తండ్రి, రామ్ కిషన్ భాకర్, ఈ వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వీడియోలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "ఖేల్ రత్న అవార్డు కోసం కమిటీ మను భాకర్‌ను పరిగణించకపోవడం చాలా షాకింగ్‌గా ఉంది. చాలా మంది మాజీ ఆటగాళ్ళు దీని గురించి మాట్లాడటానికి ప్రయత్నించారు. అయితే అధికారులు అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారిని మాత్రమే అర్హులుగా పరిగణిస్తామని చెప్పారు" అంటూ రామ్ కిషన్ అన్నారు.
అసలు వివాదం ఏంటి?
మను అవార్డును పట్టించుకోలేదని మీడియాలో కథనాలు రావడంతో చర్చ మొదలైంది. తర్వాత క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు మను భాకర్ అసలు నామినేషన్ దాఖలు చేయలేదని, అవార్డులకు పరిగణనలోకి తీసుకోవాలంటే తప్పకుండా దరఖాస్తు చేయాలని వివరించారు.