LSG vs GT IPL 2024 :2024 ఐపీఎల్లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మరోసారి ఆల్రౌండ్ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్ కష్టంగా మారిన పిచ్‌పై గుజరాత్ టైటాన్స్‌ను 33 పరుగులు తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ, గుజరాత్ ముందు 164 పరుగుల టార్గెట్ ఉంచింది. అయితే ఛేదనను ఘనంగా ఆరంభించిన గుజరాత్ పవర్ ప్లే తర్వాత తడబడింది. మొత్తంగా 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. సాయి సుదర్శన్ ( 23 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 31 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ (19 పరుగులు) ఆకట్టుకోలేకపోయాడు. ఇక కేన్ విలియమ్సన్ (1), శరత్ బీఆర్ (2), దర్శన్ నల్కండే (12), విజయ్ శంకర్ (17) విఫలమయ్యారు. చివర్లో రాహుల్ తెవాటియా (30) పోరాడిన ఫలితం దక్కలేదు. అతడి ఇన్నింగ్స్ కేవలం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే ఉపయోగపడింది. 19వ ఓవర్లో యువ పేసర్ యశ్ ఠాకూర్ - తెవాతియా, నూర్ అహ్మద్ (4)లను ఔట్ చేసి 5 వికెట్ల ప్రదర్శన పూర్తి చేయడంతో పాటు గుజరాత్ టైటాన్స్ కథను కూడా ముగించాడు. స్పిన్నర్ కృనాల్ పాండ్య (3/11) కూడా మంచి బౌలింగ్ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (6) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ (33 పరుగులు, 31 బంతుల్లో) నెమ్మదిగా ఆడాడు. వన్ డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ (7)కూడా నిరాశ పర్చాడు. ఇక మిడిలార్డర్లో మార్కస్ స్టాయినిస్ (43 బంతుల్లో 4×4, 2×6 సాయంతో 58 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆఖర్లో ఆయుశ్ బదోనీ (20 పరుగులు), నికోలస్ పూరన్ (32* పరుగులు, 22 బంతుల్లో 3×6) ఫర్వాలేదనిపించారు. దీంతో లఖ్‌నవూ స్కోర్ 160 పరుగులు దాటింది. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దర్శన్ నల్కండే తలో 2, రశీద్ ఖాన్ 1 వికెట్ దక్కించుకున్నారు.