KKR vs MI IPL 2024:2024 ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 18 పరుగుల తేడాతో నెగ్గింది. బ్యాటింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ (42 పరుగులు), నితీశ్ రానా (33 పరుగులు) బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి (2/17), రసెల్ (2/34), హర్షిత్ రానా(2/34) రాణించి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ మ్యాచ్‌లో పలు రికార్డును నమోదయ్యాయి. అవేంటంటే?
- ఐపీఎల్లో ఒకే వేదికపై అత్యధిక మ్యాచ్‌లు నెగ్గిన ముంబయి (52 విజయాలు, వాంఖడే స్టేడియం) రికార్డును కేకేఆర్ సమం చేసింది. ఇప్పటివరకు కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్‌లో 52 విజయాలు నమోదు చేసి ముంబయితోపాటు టాప్‌లో ఉంది. తర్వాత సీఎస్కే (49 విజయాలు, చిదంబంరం) రెండో స్థానంలో ఉంది.
- ఈ సీజన్లో ముంబయికి ఇది 9వ ఓటమి. ఓ సీజన్లో ముంబయికి ఇది రెండో చెత్త ప్రదర్శన. 2022లో ముంబయి 10మ్యాచ్‌ల్లో ఓడింది.
- పురుషుల టీ20 క్రికెట్లో 550+ వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా సునీల్ నరైన్ రికార్డు కొట్టాడు. ఇప్పటివరకు నరైన్ టీ20ల్లో 550 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ లిస్ట్‌లో వెస్టిండీస్ మాజీ ప్లేయర్ డ్వేన్ బ్రావో 625 వికెట్లతో టాప్‌లో ఉండగా, అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 574 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
- ఐపీఎల్లో సింగిల్ ఎడిషన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో 5 విజయాలు సాధించడం కోల్‌కతాకు ఇది నాలుగోసారి. ఈ సీజన్లో కేకేఆర్ ఈడెన్‌లో 7మ్యాచ్‌లు ఆడగా ఐదింట్లో నెగ్గింది. గతంలో 2010 (7మ్యాచ్‌ల్లో 5 విజయాలు) , 2015 (6మ్యాచ్‌ల్లో 5 విజయాలు), 2018 (9మ్యాచ్‌ల్లో 5 విజయాలు) ఈ ఫీట్ సాధించింది. ఇక 2014 సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఈడెన్‌లో ఆడగా నాలుగింట్లోనూ కేకేఆర్ గెలుపొందింది.
నరైన్ అరుదైన ఫీట్:ఈ మ్యాచ్‌లో నరైన్ 1 వికెట్ దక్కించుకున్నాడు. దీంతో ప్రస్తుత సీజన్లో నరైన్ వికెట్ల సంఖ్య 15కు చేరింది. ఈ క్రమంలో నరైన్ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. సింగిల్ ఐపీఎల్ ఎడిషన్‌లో 400+ పరుగులు, 15+ వికెట్లు దక్కించుకున్న మూడో ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో షేన్ వాట్సన్ (2008లో 472 పరుగులు, 17 వికెట్లు), జాక్ కలిస్ (2012లో, 409 పరుగులు, 15 వికెట్లు) ఈ ఫీట్ అందుకున్నారు.