Ind vs Ban Kanpur Test 2024 :బంగ్లాపై తొలి టెస్టులో భారీ విజయం సాధించి జోరుమీదున్న భారత్ రెండో మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ టెస్టు సెప్టెంబర్ 27న ప్రారంభం కానుంది. దీనికి కాన్పుర్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో ఓ విషయం క్రికెట్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. కాన్పూర్ స్టేడియంలోని ఒక స్టాండ్ బలహీనంగా ఉందట. ఆ స్టాండ్‌లో ప్రేక్షకులు పూర్తి స్థాయిలో నిండినట్లైతే అది కూలే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.
కాన్పూర్ స్టేడియంలో చివరిసారిగా 2021లో టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత భారత్- బంగ్లాదే తొలి టెస్టు మ్యాచ్. అయితే ఈ స్టేడియంలోని ఒక స్టాండ్ బలహీనంగా ఉన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (Public Works Department) వెల్లడించిందని ఒక జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. ఆ స్టాండ్‌లో క్రౌడ్ ఫుల్‌గా నిండితే అది కూలిపోయే ప్రమాదముందని అధికారులు తెలిపినట్లు ఆ మీడియా వెల్లడించింది. అందుకే ఆ స్టాండ్‌లో 50శాతం కంటే తక్కువగా టికెట్లు అమ్ముతున్నట్లు పేర్కొంది.
'బాల్కనీ C స్టాండ్‌పై పీడబ్ల్యూడీ కొన్ని సమస్యలు లేవనెత్తింది. మేం కూడా వాటితో అంగీకరించాం. అందులో సగానికంటే ఎక్కువ టికెట్లు విక్రయించం. ఈ స్టాండ్ కెపాసిటీ 4,800 కాగా, అందులో 1700 టికెట్లు మాత్రమే అమ్మాలని మాకు చెప్పారు. మరమ్మతు పనులు రెండు రోజుల పాటు కొనసాగుతాయి' అని యూపీ క్రికెట్ అసోసియేషన్ సీఈవో అంకిత్ ఛటర్జీ చెప్పినట్లు తెలుస్తోంది.