CRMP-2 Road Maintenance : సీఆర్ఎంపీ-2 రహదారుల సమగ్ర నిర్వహణ కార్యక్రమం పేరుతో జీహెచ్ఎంసీ రాబోయే ఐదేళ్లకు 1,142.54 కి.మీ రోడ్లకు రూ. 3,825 కోట్లను వెచ్చించేందుకు సిద్ధమైంది. అంటే సగటున కిలో మీటరుకు రూ.3.35 కోట్లు పెడుతుంది. ఐదేళ్ల కిందట సీఆర్ఎంపీ-1 ప్రాజెక్ట్ మొదలైనప్పుడు ఈ సగటు వ్యయం రూ.2.59 కోట్లు ఉండగా తాజాగా 3.35 కోట్లకు చేరుకుంది.
బాగున్న రోడ్లపైనే వందల కోట్ల ఖర్చు : రాబోయే ఐదేళ్లు పూర్తయ్యేనాటికి ఆ సగటు వ్యయం రూ. 4.5 కోట్లకు చేరవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు మొదటి దశలో పునర్ నిర్మించిన వందలాది కిలోమీటర్ల రోడ్లనే రెండో దశలోనూ కొనసాగించడం అనుమానాలకు తావిస్తోంది. కొన్నేళ్లుగా నిర్మాణాలకు నోచుకోకుండా గుంతలతో ప్రజలను ఇబ్బందిపెట్టే అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. బాగున్న రోడ్లపైనే వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తామంటూ ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆమోదించాలంటూ స్థాయీ సంఘానికి పంపించడంపై ఆరోపణలు వస్తున్నాయి.
సీఆర్‌ఎంపీ-1లో : 2020లో సీఆర్‌ఎంపీ-1 మొదలైంది. ఏడు ప్యాకేజీలుగా 709కి.మీ రోడ్లను రూ.1,839 కోట్లతో ఐదేళ్లపాటు నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ పనులు అప్పగించింది. ఈ క్రమంలో మరికొన్ని రోడ్లను చేర్చడంతో జీహెచ్‌ఎంసీ రూ.2,491కోట్లు వెచ్చించింది. మొదటి దశ పూర్తవడంతో 2025-2030 కాలానికి రెండో దశకు ఇంజినీర్లు ప్రతిపాదనలు రూపొందించారు.
పాత రోడ్లనే : సీఆర్‌ఎంపీ-1లో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం జరిగింది. ఆయా రోడ్లకు, మరో 398.32కి.మీ రోడ్లను కలిపి మొత్తం 1,142.54 కి.మీ రోడ్లకు సీఆర్‌ఎంపీ-2 ప్రతిపాదించారు. అవసరమైనచోట వరదనీటి కాలువలను నిర్మించి, నిర్వహించడం, ప్రధాన దారుల్లోని వరదనీటి కాలువలు, మ్యాన్‌హోళ్ల నిర్వహణ రెండోదశలో భాగమని ఇంజినీర్లు చెబుతున్నారు.