Joe Root Test Records:ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో మరో అరుదైన ఘనత అందుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు బాదిన ఆరో బ్యాటర్‌గా రికార్డ్ సాధించాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మూడో మ్యాచ్‌లో రూట్ ఈ మైలురాయి అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (12400 పరుగులు)ను రూట్ (12402 పరుగులు) అధిగమించాడు. కాగా, టెస్టుల్లో ఇప్పటివరకు 146 మ్యాచ్‌లు ఆడిన రూట్ 12402 పరుగులు చేశాడు. అందులో 34 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక సుదీర్ఘ ఫార్మట్ క్రికెట్లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (15921 పరుగులు) టాప్‌లో ఉన్నాడు.
టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరులు
ప్లేయర్ | జట్టు | మ్యాచ్‌లు | పరుగులు | సెంచరీలు |
సచిన్ తెందూల్కర్ | భారత్ | 200 | 15921 | 51 |
రికీ పాంటింగ్ | ఆస్ట్రేలియా | 168 | 13378 | 41 |
జాక్ కలీస్ | సౌతాఫ్రికా | 166 | 13289 | 45 |
రాహుల్ ద్రవిడ్ | భారత్ | 164 | 13288 | 36 |
అలిస్టర్ కుక్ | ఇంగ్లాండ్ | 161 | 12474 | 33 |
జో రూట్ | ఇంగ్లాండ్ | 146 | 12402 | 34 |
ఇక ఈ ఇన్నింగ్స్‌లో రూట్ 12 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే మరో 83 పరుగులు బాదితే కుక్‌ను కూడా రూట్ అధిగమించి టెస్టుల్లో అత్యధిక పరుగులు బాదిన ఐదో బ్యాటర్‌గా అవతరిస్తాడు. ఇంగ్లాండ్ వచ్చే నెలలోనే పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ ఆడనున్న నేపథ్యంలో రూట్ త్వరలోనే ఆ మైలురాయి కూడా అందుకోవడం లాంఛనమే.