Jay Shah On Ishan Kishan: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు రోజూ ఎదో రూపంలో పరోక్షంగా హెచ్చరికలు జారీ అవుతున్నాయి! బీసీసీఐ సెక్రటరీ జై షా తాజా వ్యాఖ్యలు కూడా ఇషాన్తోపాటు మరికొంత మంది ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చినట్లుగానే ఉన్నాయి. ఫూర్తి ఫిట్నెస్తో ఉన్న ఆటగాళ్లందరూ రంజీ ట్రోఫీల్లో ఆడాల్సిందేనని జై షా మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో క్రమశిక్షణ తప్పిన ఆటగాళ్లను సహించేది లేదని షా తేల్చి చెప్పారు.
'డొమెస్టిక్ టోర్నీల్లో ఆడాలని కోచ్, సెలక్టర్లు, కెప్టెన్ చెబితే తప్పకుండా ఆడాల్సిందే. ఈ విషయాన్ని ఇదివరకే ఆటగాళ్లకు ఫొన్ చేసి చెప్పాం. దీనిపై నేనూ వాళ్లకు లెటర్ రాస్తా. బోర్డు కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్లంతా టీమ్ఇండియాకు ఆడని సమయంలో రంజీలో ఆడాలి. కాంట్రాక్ట్‌లో ఉన్న ప్లేయర్లందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. గాయాల బారిన పడ్డ ఆటగాళ్లకు మాత్రమే ఇందుకు మినహాయింపు ఉంటుంది. వారిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాం. ఫిట్‌గా ఉన్న వాళ్లంతా డొమెస్టిక్‌లో ఆడాలి. లేకపోతే సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కుల్ని సెలక్షన్ కమిటీకి ఇచ్చేస్తా' అని ఓ ఈవెంట్లో పాల్గొన్న షా అన్నారు.
అయితే ఈ కామెంట్లు పరోక్షంగా ఇషాన్ కిషన్‌పై చేసినట్లే అనిపిస్తోంది. గతేడాది డిసెంబర్లో సౌతాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే వచ్చేసిన ఇషాన్, అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉంటున్నాడు. రీసెంట్గా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఇషాన్‌ను రంజీల్లో ఆడాల్సిందేనని సూచించినా అతడు పట్టించుకోలేదు. అయితే ఇషాన్తోపాటు రంజీలో ఆడకుండా ఇప్పటి నుంచే ఐపీఎల్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్లేయర్ల పట్ల బీసీసీఐ కోపంగా ఉంది.