Jasprit Bumrah England Series : సొంతగడ్డపై జరగనున్న ఐదు రోజుల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు సర్వం సిద్ధమవుతోంది. ఈ సారి ఎలాగైనా ఇంగ్లాండ్ జట్టును ఓడించాలని కసితో ప్రాక్టీస్ చేస్తోంది. మరో రెండు రోజుల్లో హైదరాబాద్ వేదికగా జరగనున్న టెస్ట్ కోసం ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ ప్లేయర్లు బాజ్ బాల్ ఆటతో తనపై పైచేయి సాధించలేరంటూ ధీమా వ్యక్తం చేశాడు.
"బాజ్ బాల్ ఆటతో చెలరేగుతున్న ఇంగ్లాండ్ జట్టుకు అభినందనలు. అయితే ఓ బౌలర్‌గా నేనెప్పుడూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తాను. వాళ్లు దూకుడుగా ఆడి నన్ను అలసిపోయేలా చేయలేరు. ఎందుకంటే వాళ్లకు నేను వికెట్లు పడగొట్టి బదులిస్తాను. గ్రౌండ్లో దిగిన ప్రతిసారి పరిస్థితులను నాకు అనుకూలంగా ఎలా మలచుకోవాలన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తాను" అంటూ బుమ్రా పేర్కొన్నాడు. ఇక ఈ స్టార్ క్రికెటర్ ఇప్పటివరకు టెస్టుల్లో 21.21 సగటుతో 140 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.