James Anderson England Series : విశాఖ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇంగ్లాండ్ టీమ్ రెండు మార్పులు చేసి తమ తుది జట్టును ప్రకటించింది. అలా జట్టు కూర్పు కారణంగా తొలి టెస్ట్ ఆడే అవకాశం దక్కని 41 ఏళ్ల ఇంగ్లాండ్ ప్లేయర్ జేమ్స్ ఆండర్సన్రెండో టెస్ట్‌తో బరిలోకి దిగున్నాడు. ఇతడి రాకతో తొలి టెస్ట్ ఆడిన మరో పేసర్ మార్క్ వుడ్ బెంచ్‌కు పరిమితమయ్యాడు.
మరోవైపు తొలి టెస్ట్‌లో గాయపడిన సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో పాక్ మూలాలున్న షోయబ్ బషీర్‌కు ఛాన్స్ దక్కింది. అయితే ఆండర్సన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట ట్రెండ్ అవుతోంది. అదేంటంటే ఆండర్సన్ 2003, మే 22న తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. అయితే ఆ సమయానికి ఇప్పటి ఇంగ్లాండ్ జట్టులో ఉన్న ఇద్దరు ప్లేయర్స్ అసలు పుట్టనే లేదు. వారెవరో కాదు షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్. 2003 అక్టోబర్ 13న బషీర్ పుట్టగా, రెహాన్ 2004, ఆగస్ట్ 13న జన్మించాడు. ఈ మాట విన్న క్రికెట్ లవర్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆండర్సన్ ఫిట్నెస్, అతడికి ఆట పట్ల ఇంట్రెస్ట్ గురించి కొనియాడుతున్నారు.
మరోవైపు ఆండర్సన్ ప్రస్తుత టెస్ట్ క్రికెట్లో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఆడిన 183 టెస్టుల్లో 690 వికెట్లు పడగొట్టి ఈ ప్లేస్‌లో ఉన్నాడు. అయితే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఇప్పటికీ శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ పేరిట ఉంది. ఈయన 800 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. అతనికి తర్వాతి స్థానంలో 708 వికెట్లతో దివంగత ప్లేయర్ షేన్ వార్న్ ఉన్నాడు. వీరిద్దరి తర్వాతి స్థానాన్ని ఆండర్సన్ కైవసం చేసుకున్నాడు.