Israel Bombards Central Beirut : హెజ్‌బొల్లాతో ఓ వైపు సంధికి సిద్ధమంటోన్న ఇజ్రాయెల్, మరోవైపు లెబనాన్‌లోని వారి స్థావరాలపై విరుచుకుపడుతోంది. మరికొన్ని గంటల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ఆమోదం తెలుపనున్న సమయంలోనే, సెంట్రల్ బీరుట్‌పై బాంబుల వర్షం కురిపించింది. అయితే దాడులు మొదలుపెట్టక ముందు, అక్కడి భవనాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇజ్రాయెల్ చేసిన ఈ తాజా వైమానిక దాడుల్లో ఎంత మంది మరణించారనే విషయం తెలియరాలేదు. కానీ హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఐడీఎఫ్ వెల్లడించింది.
సీజ్‌ఫైర్‌ను నెతన్యాహు ఆమోదిస్తారా?
హెజ్‌బొల్లాతో కాల్పుల విరమణకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భద్రతా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ సమావేశంలోనే కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందానికి హెజ్‌బొల్లా కూడా అంగీకరించినట్లు లెబనాన్ అధికారులు వెల్లడించారు. ఒకవేళ ఇది ఇరువైపులా ఆమోదం పొందితే, ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కొనసాగుతోన్న యుద్ధం ముగింపునకు కీలక ముందడుగు పడినట్లేనని భావిస్తున్నారు.