Gruha Jyothi Scheme Issue in Telangana : హైదరాబాద్ నార్సింగికి చెందిన ఓ వ్యక్తికి ఈ నెల 3న గృహజ్యోతి బిల్లు వచ్చింది. 30 రోజులకు 196 యూనిట్లు వాడినట్లు ఉంది. ఇది జనవరి బిల్లు. ఆ నెలలో 31 రోజులకు సర్దుబాటు చేశారు. దీంతో సగటు నెల యూనిట్లు 203 యూనిట్లు అయ్యాయి. గృహజ్యోతి పథకంలో 200 యానిట్ల వరకే సున్నా బిల్లు వర్తిస్తుంది. ప్రస్తుతం 200 యూనిట్లు దాటడంతో ఆ వ్యక్తికి రూ.1140 బిల్లు వచ్చింది. అధికారులను సంప్రదిస్తే తామేమీ చేయలేమని చేతులెత్తేశారు.
గ్రేటర్‌లో ప్రతి నెలా బిల్లులు జారీ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరికి 29 రోజులకు, కొందరికి 32 రోజులు ఇలా వెనకా ముందు బిల్లింగ్ జారీ చేస్తున్నారు. ఆలస్యంగా తీయడం ద్వారా స్లాబ్ మారి అధిక బిల్లులు వస్తున్నాయి. దీంతో కొన్నేళ్ల క్రితం కాల్చిన యూనిట్ల ఆధారంగా కాకుండా నెల సగటు యూనిట్ల ఆధారంగా శ్లాబును నిర్ణయించే పద్ధతిని ప్రవేశపెట్టారు.
తామేందుకు మోయాలని ప్రశ్నలు : మీటరు రీడర్లు ఒక్కోసారి ఒకటి, రెండ్రోజుల ముందే బిల్లులు ఇస్తుంటారు. ఉదాహరణకు జనవరిలో 28వ తేదీన అంటే మూడ్రోజులు ఉండగానే నెల బిల్లింగ్ ఇచ్చారు. 28 రోజులకు వచ్చిన బిల్లును మిగతా మూడు రోజులకు సగటు లెక్కన బిల్లు జారీ చేశారు. గృహజ్యోతి నిబంధనల ప్రకారం నిర్ణీత 200 యూనిట్లు దాటుతుండటంతో బిల్లు మోత మోగుతోంది. ఇక్కడ లబ్ధిదారుల నుంచి పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సరిగ్గా నెలకు బిల్లు ఇవ్వకపోవడం విద్యుత్తు సంస్థ సేవా లోపమైతే, ఆ భారం తామేందుకు మోయాలని ప్రశ్నిస్తున్నారు. నెల ముగిసిన తరువాతే ఇస్తే లెక్కలు సరిగా ఉంటాయని చెబుతున్నారు.
అర్జీలు పెట్టుకోవచ్చు : ఇదే విషయమై ఈ నెల 28 వరకు వినియోగదారుల నుంచి ఈఆర్‌సీ అభ్యంతరాలను ఆహ్వానిస్తోంది. వీటిపై బహిరంగ విచారణ ఉంటుంది. వినియోగదారులు వెబ్‌సైట్‌లో లేదా నేరుగా టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో అర్జీ పెట్టుకోవచ్చు. సమస్యను పరిష్కరిస్తారు.
ఈ పథకంలో లేనివారు సైతం ముందస్తు బిల్లింగ్‌తో నష్టపోతున్నా, వారిపై భారం తక్కువగా ఉంటోంది. తేడా రూ.వందల్లో మాత్రమే వస్తుంది. అదే గృహజ్యోతి లబ్ధిదారులైతే సున్నా బిల్లు రావాల్సిన చోట రూ.వేలు కట్టాల్సి వస్తోంది. రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఆమోదించిన విధానం ఆధారంగా సాఫ్ట్‌వేర్ రూపొందించి బిల్లింగ్ జారీ చేస్తున్నామని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈఆర్‌సీకి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఏంటీ ఇది నిజమేనా? - ఒక్క బోరు మోటారు బిల్లే అక్షరాలా రూ.8 లక్షలు!
రూ.938కే కొత్త మీటర్ కనెక్షన్ - ఈ నెల 30 వరకే అవకాశం - ఇప్పుడే త్వరపడండి