Tata Tiago Sales: టాటా మోటార్స్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగో అరుదైన ఘనత సాధించింది. ఇదివరకూ లేని విధంగా దీని సేల్స్ గణనీయంగా పెరిగాయి. ఏకంగా 6 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును దాటింది. అది కూడా ప్రారంభించిన ఎనిమిదిన్నర సంవత్సరాల తర్వాత ఈ మైలు రాయిని చేరుకోవడం గమనార్హం. టాటా టియాగో ఏప్రిల్ 6, 2016న లాంఛ్ అయింది. ఇప్పుడు రికార్డు స్థాయిలో మంచి సేల్స్ రాబట్టి అదరగొట్టింది. ఈ మేరకు SIAM డేటా రిలీజ్ చేసింది.
SIAM రిలీజ్ చేసిన డేటా ప్రకారం.. అక్టోబర్ 2024 చివరి నాటికి మొత్తం 5,96,661 టియాగో యూనిట్లు సేల్ అయ్యాయి. ఇది 6 లక్షల మార్కును చేరుకోవడానికి కేవలం 3,339 యూనిట్లు మాత్రమే తక్కువ. ఆగస్టు-అక్టోబర్ 2024 మధ్య కాలంలో ఈ హ్యాచ్‌బ్యాక్ నెలవారీ సగటు అమ్మకాలు 4,546 యూనిట్లు. కంపెనీ ప్రతిరోజూ దాదాపు 151 యూనిట్లను విక్రయించింది. ఈ క్రమంలో నవంబర్ 2024 మొదటి మూడు వారాల్లో మిగిలిన 3,339 యూనిట్ల విక్రయాలను పూర్తి చేసింది.
టాటా మోటార్స్ థ్రీ-మోడల్ ప్యాసింజర్ కారు పోర్ట్‌ఫోలియోలో టియాగో, టిగోర్ సెడాన్, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ ఉన్నాయి. వీటిలో టియాగో అత్యధిక సేల్స్‌ను నమోదు చేసింది. టియాగో ఉత్తమ సేల్స్ FY 2019లో ఉన్నాయి. ఈ కారు 92,369 యూనిట్లు సేల్ అయ్యాయి. ఇది కంపెనీ ప్యాసింజర్ కార్ల అమ్మకాల 1,31,387 యూనిట్లలో 71 శాతం. మొత్తం ప్యాసింజర్ వాహనాల (కార్స్ అండ్ SUVs) అమ్మకాలలో 2,31,512 యూనిట్లలో టియాగో 40 శాతం వాటాను కలిగి ఉంది.
అయితే COVID-19 మహమ్మారి కారణంగా 2020 నుంచి మూడు ఆర్థిక సంవత్సరాల్లో వీటి విక్రయాలు 49,000-58,000 యూనిట్ల మధ్య జరిగాయి. ఆ తర్వాత FY 2023లో వీటి డిమాండ్ పెరిగింది. దీని హోల్‌సేల్స్ 33 శాతం పెరిగి 77,399 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక అవి FY 2024లో 85,478 యూనిట్లకు చేరాయి.
ఒక దశాబ్దపు కాలం నాటి డేటాను పరిశీలిస్తే.. ప్యాసింజర్ల విక్రయాల్లో కంపెనీకి చెందిన టియాగో వాటా చాలా ఎక్కువగా ఉంది. FY 2017లో దీని వాటా 42 శాతం ఉండగా.. అది FY 2019లో 71 శాతానికి పెరిగింది. ఆ తర్వాత కొవిడ్ కారణంగా దీని సేల్స్ పడిపోగా.. ప్రస్తుతం FY 2025 ఏప్రిల్-అక్టోబర్ 2024 కాలంలో దీని వాటా 51 శాతంగా ఉంది.
టియాగో విక్రయాల సంఖ్య ఇప్పటికే 6 లక్షలకు చేరుకోవడం గమనించదగ్గ విషయం. అయితే గత కొన్నేళ్లుగా మార్కెట్లో SUVలకు డిమాండ్ పెరగడంతో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ డిమాండ్ తగ్గుముఖం పట్టింది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో 37,202 యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 33 శాతం తగ్గాయని అంచనా.
ఐఫోన్ ధరతో రియల్మీ కొత్త ఫోన్- అబ్బా.. ఏం ఫీచర్లు రా బాబు.. మైండ్ బ్లోయింగ్..!
గూగుల్ క్యాలెండర్లో కొత్త ఫీచర్- ఇకపై టాస్క్ మేనేజ్మెంట్ మరింత ఈజీ..!