Irfan Pathan On Dhoni: 2024 ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్- పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ ఎమ్ ఎస్ ధోనీ వ్యవహరించిన తీరు పలువురిని ఆశ్చర్యపర్చింది. ఆఖరి ఓవర్లో ఈజీగా వచ్చే సింగిల్‌కు ధోనీ నిరాకరించడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇక దీనిపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించాడు. ధోనీ అలా చేయాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు.
'ధోనీకి ఫ్యాన్స్ ఎక్కువే. అందరూ అతడి సిక్స్‌ల గురించే మాట్లాడుకుంటారు. కానీ, ఈ మ్యాచ్‌లో ధోనీ సింగిల్ నిరాకరించకుండా ఉండాల్సింది. ఇది టీమ్ గేమ్. ఈ టీమ్ గేమ్స్‌లో ఇలా చేయకూడదు. డారిల్ మిచెల్ కూడా ఇంటర్నేషనల్ స్టార్ ప్లేయర్. ఒకవేళ అతడు బౌలరైతే నేనూ అర్థం చేసుకునేవాణ్ని' అని ఇర్ఫాన్ పఠాన్ స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్ చిట్‌చాట్‌లో అన్నాడు.
జరిగింది ఇది:
చెన్నై ఇన్నింగ్స్‌లో 20ఓవర్లో క్రీజులో ఉన్న ధోనీ 3వ బంతిని డీప్ కవర్ మీదుగా ఆడాడు. బంతి 30 యార్డ్ సర్కిల్ బయటకు వెళ్లింది. దీంతో నాన్ స్ట్రైక్‌లో ఉన్న డారిల్ మిచెల్ సింగిల్ కోసం ప్రయత్నించి దాదాపు స్ట్రైకింగ్ లైన్ దాకా వచ్చాడు. కానీ, ధోనీ సింగిల్‌ను నిరాకరించాడు. వెంటనే డారిల్ మిచెల్ తిరిగి నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌కు పరుగు తీశాడు. ఈ క్రమంలో త్రుటిలో రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. దీంతో ఆ బంతికి పరుగులేమీ రాలేదు. ఇక నాలుగో బంతిని కూడా డాట్ చేసిన ధోనీ ఐదో బంతిని స్టాండ్స్ (6) లోకి పంపాడు. ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ 11 బంతులు ఆడి 14 పరుగులు చేశాడు.