IPL Chasings Without Wicket Loss:2024 ఐపీఎల్‌లో బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ సీజన్‌లో నమోదవుతున్న అత్యధిక స్కోర్లు, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు, సెంచరీలే అందుకు నిదర్శనం. ప్రస్తుతం బ్యాటర్లు పవర్ ప్లేని తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్‌లు సద్వినియోగం చేసుకుని భారీగా రన్స్ చేస్తున్నారు. ఛేదనలో అయితే తొలి 6 ఓవర్లలోనే లక్ష్యాన్ని భారీగా కరిగించేస్తున్నారు. అనంతరం సాఫీగా టార్గెట్‌ని ఛేదిస్తున్నారు. ఇలా ఐపీఎల్ హిస్టరీలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి ఐపీఎల్‌లో 10 వికెట్ల తేడాతో నెగ్గిన టాప్- 5 మ్యాచ్‌లు ఏవో చూద్దాం.
రాజస్థాన్ vs ముంబయి (2012):2012 సీజన్‌లో 72వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి, 162 పరుగులు చేసింది. అనంతరం ముంబయి ఇండియన్స్ ఓపెనర్లు మాత్రమే 163 లక్ష్యాన్ని ఛేదించేశారు. సచిన్ 51 బంతుల్లో 58, స్మిత్ 58 బంతుల్లో 87 పరుగులు చేశారు. ముంబయి పది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
పంజాబ్ vs చెన్నై(2020):2020 ఐపీఎల్ 18వ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) 178 పరుగులు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు ఫాఫ్ డు ప్లెసిస్, షేన్ వాట్సన్ పవర్‌ప్లేనే 60 పరుగులు చేశారు. 17.4 ఓవర్లలో 181 పరుగులు చేసి చెన్నైకి విజయం అందించారు. ఫాఫ్ (53 బంతుల్లో 87*), వాట్సన్ (53 బంతుల్లో 83*) పరుగులు చేశారు.
బెంగళూరు vs రాజస్థాన్(2021):ఐపీఎల్ 2021లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 178 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ 16.3 ఓవర్లలోనే 181 పరుగులు చేసి మ్యాచ్ గెలిచారు. పడిక్కల్ (52 బంతుల్లో 101*), కోహ్లి (47 బంతుల్లో 72*) స్కోర్ చేశారు.