IPL 2025 Mega Auction:2025 ఐపీఎల్‌కు సంబంధించి మెగా వేలం విషయంలో కీలక పరిణామం జరిగింది. ఈ మెగా వేలం గురించి ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్స్‌తో చర్చించేందుకు బీసీసీఐ ఏప్రిల్ 16న ఏర్పాటు చేసిన సమావేశం వాయిదా పడింది. ఈ విషయాన్ని బీసీసీఐ తాజాగా ప్రకటించింది. అయితే ఈ కీలక భేటీ ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పు కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. సమావేశానికి కొత్త తేదీని ఇంకా నిర్ణయించలేదని బీసీసీఐ ఫ్రాంచైజీ యజమానులకు తెలియజేసినట్లు సమాచారం.
అయితే ఐపీఎల్‌లో రిటెన్షన్ ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని పలు ప్రాంఛైజీలు కోరుతున్న వేళ దానిపై ఈ సమావేశంలో చర్చ జరపాలని భావించారు. దీంతో వచ్చే ఏడాది నిర్వహించనున్న ఐపీఎల్ 2025 మెగా వేలం సహా ఆటగాళ్ల రిటెన్షన్ గురించి ఈ సమావేశంలో చర్చ జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న నిబంధనల ప్రకారం మెగా వేలానికి ముందు ప్రతి జట్టు నలుగురు (4) ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందులో ముగ్గురు భారత ఆటగాళ్లు, ఒక విదేశీ ఆటగాడు లేదా ఇద్దరేసి చొప్పున భారత, విదేశీ ఆటగాళ్లు ఉండాలి. అయితే ఈ సంఖ్యను 4 నుంచి 8కి పెంచాలని పలు ప్రాంచైజీలు కోరుతుండగా, మరోవైపు దీనిని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించాలని బీసీసీఐ భావించింది.