IPL 2024 SRH Vs Kolkata Knight Riders Harshit Rana : ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచింది. తమ మొదటి మ్యాచ్‌లోనే విజయం సాధించింది. అందుకు కారణం యువ బౌలర్ హర్షిత్ రాణా. ఇతడు చివరి ఓవర్‌లో హైదరాబాద్‌కు 13 పరుగులు అవసరమైన సమయంలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టును గెలిపించాడు. కీలకంగా ఆడుతున్న క్లాసెన్‌తో పాటు షహబాజ్ వికెట్లను పడగొట్టాడు. అంతకుముందు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (32)ను ఔట్ చేశాడు. ఆరో ఓవర్ వేసిన రానా బౌలింగ్‌లో మయాంక్ భారీ షాట్‌కు యత్నించి రింకూ సింగ్ చేతికి చిక్కేశాడు. అయితే వికెట్ తీసిన సంతోషంలో రానా మయాంక్ దగ్గరకు వెళ్లి మరీ కళ్లలోకి చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ఓవరాక్షన్ చేశాడు. అంతేకాదు క్లాసెన్తోనూ గొడవ పడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఎందుకంత ఓవరాక్షన్ బ్రో కొంచెం తగ్గించుకుంటే మంచిది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. కాగా, మొత్తంగా మ్యాచ్‌లో హర్షిత్ రాణా ప్రదర్శన విషయానికొస్తే 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
దీంతో ప్రవర్తనానియమావళిని ఉల్లంఘించిన అతడికి భారీ జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఈ జరిమానా విధించారు. హర్షిత్ రాణాకు అతని మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత కోశారు. మయాంక్ అగర్వాల్‌తో చేసిన చర్యకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కట్ చేయగా క్లాసెన్‌తో గొడవ కారణంగా మరో 50 శాతం తగ్గించారు. ఐపీఎల్ 2024లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన మొదటి ఆటగాడిగా హర్షిత్ రాణా నిలిచాడు.