IPL 2024 RCB :ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎక్కువ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న పాపులర్ టీమ్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఒకటి. ఈ టీమ్‌లో ఉన్న స్టార్ క్రికెటర్‌ల వల్లనే ఆర్సీబీ ఇంత పాపులర్ అయింది. మొదటి సీజన్ నుంచి ప్రస్తుత ఐపీఎల్ 17 సీజన్ వరకు ఆర్సీబీలో స్టార్ క్రికెటర్‌లకు కొదవలేదు. ప్రతి సీజన్‌కు ముందు ఈ సాలా కప్ నమ్‌దే స్లోగన్‌తో ప్రచారాలు ప్రారంభించే ఆర్సీబీ, లీగ్ చివరి దశకు చేరుకునే సరికి నిరాశ మిగులుస్తోంది. ఐపీఎల్ 2024లోనే జట్టు ఆశించిన ఫలితాలు సాధించక పోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఏప్రిల్ 15న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ ఐపీఎల్‌లో రికార్డు స్కోరు(287) సాధించడం, ఆర్సీబీ మొత్తంగా ఆరో ఓటమిని మూటగట్టుకోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు ప్రముఖులు మహేష్ భూపతి, టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్, మనోజ్ తివారీ తదితరులు ఆర్సీబీ టీమ్ మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు.
- ఆర్సీబీపై వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవమైన ప్రదర్శనపై సెహ్వాగ్, తివారీ స్పందించారు. భారత సహాయక సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో భారత ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం కనిపించిందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. RCB కోచింగ్ స్టాఫ్‌లో ఎక్కువగా విదేశీ కోచ్‌లు ఉంటారని, లోకల్ ప్లేయర్స్ డెవలప్‌మెంట్‌కు ఆటకంగా మారిందని చెప్పాడు.
"టీమ్‌లో 12-15 మంది భారతీయ ఆటగాళ్లు ఉంటే, కేవలం 10 మంది ఓవర్‌సీస్ ప్లేయర్‌లు ఉంటారు. సపోర్టింగ్ స్టాఫ్ మొత్తం విదేశీలు ఉంటే సమస్య తలెత్తుతుంది. భారత ఆటగాళ్లలో సగం మందికి ఇంగ్లీష్ కూడా రాదు. వారిని ఎలా మోటివేట్ చేస్తారు? వారితో ఎవరు సమయం గడుపుతారు? వారితో ఎవరు మాట్లాడతారు? ఆర్సీబీలో నేను ఒక్క భారతీయ సిబ్బందిని కూడా చూడలేదు. కనీసం ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్ పెంచే వ్యక్తి ఎవరైనా ఉండాలి' అని పేర్కొన్నాడు. కెప్టెన్సీ విషయంపైనా సెహ్వాగ్ మాట్లాడాడు. భారత కెప్టెన్ ఉంటే ఆటగాళ్లు మనసులో మాటను చెప్పగలరని తెలిపాడు. RCBకి కనీసం 2-3 మంది భారతీయ సహాయక సిబ్బంది అవసరమని సూచించాడు.
- ఆర్సీబీ సమస్య నాకు తెలుసు?
మనోజ్ తివారీ మాట్లాడుతూ - "సమస్య ఏంటో నాకు తెలుసు. వేలంలో అందరు ప్లేయర్‌లను ఇతర టీమ్‌లకు వెళ్లి ఆడమని వదిలేస్తారు. అలా వదిలేసిన చాహల్, ఈ సీజన్‌లో పర్పుల్ క్యాప్ హోల్డర్. ఆర్సీబీ వదులుకున్న శివమ్ దూబే అద్భుతంగా రాణిస్తున్నాడు. అదనంగా గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్ వంటి ఖరీదైన ఆటగాళ్లను తీసుకోవడం ఆశ్చర్యకరం. ఆర్సీబీ బ్యాటింగ్ సమస్య కాదు. వారికి స్పెషలిస్ట్ స్పిన్నర్ లేడు. కొన్ని ఆన్-ఫీల్డ్ కెప్టెన్సీ కాల్స్ భయంకరంగా ఉంటున్నాయి. ఆర్సీబీకి లాంగ్ టర్మ్ గోల్, సమూల ప్రక్షాళన అవసరం" అని వివరించాడు.