IPL 2024 Mumbai Indians VS Sunrisers Hyderabad :ఐపీఎల్ 2024 సీజన్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. మరి కొన్ని గంటల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హోం గ్రౌండ్లో - ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ ఇప్పట్లో జట్టుతో చేరే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది. గాయం కారణంగా ఈ లంక ప్లేయర్ మరి కొంత కాలం ఆటకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అంటే ఎస్‌ఆర్‌హెచ్ క్యాంపులోకి అతడు చేరడం మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం అందుతోంది.
వనిందు హసరంగ ఈ మధ్యే బంగ్లాదేశ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో లంక తరఫున ఆడాడు. వన్డే, టీ20 మ్యాచ్‌లలో ఆడిన అతడు మొత్తంగా ఎనిమిది వికెట్లు(6,2) వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈ సిరీస్ తర్వాత అతడు ఎడమకాలికి నొప్పితో బాగా బాధపడ్డాడు. దీంతో శ్రీలంక క్రికెట్ వైద్య బృందం అతడి గాయం తీవ్రతను గుర్తించి ప్రాథామిక చికిత్స చేయించింది. విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకోవాలని అతడికి సూచనలు చేసినట్లు ఇంగ్లీష్ మీడియాల్లో కథనాలు వచ్చాయి. దీంతో అతడు ఇప్పట్లో సన్‌రైజర్స్ క్యాంపులో చేరే అవకాశాలు లేవని కథనాల్లో రాసి ఉంది.
2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించాడు వనిందు హసరంగ. అప్పుడు 7.54 ఎకానమీతో 26 వికెట్లు తీశాడు. అతడు లోయర్ ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్ చేయగలిగే సమర్థుడు. అయితే, ఐపీఎల్ - 2024 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది.