IPL 2024 MS Dhoni Fan : ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మహీ ఫ్యాన్ ఒకరు మైదానంలోకి దూకి అందరి దృష్టిని ఆకర్షించాడు. స్టేడియంలోకి దూసుకెళ్లిన అతడు డైరెక్ట్‌గా ధోనీ పాదాలను తాకి మిస్టర్ కూల్‌ను పలకరించాడు. మహీ కూడా సదరు అభిమానిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని కాసేపు ముచ్చటించాడు. అయితే తాజాగా తనతో మహీ ఏమీ మాట్లాడాడో స్వయంగా ఆ అభిమానే వెల్లడించాడు.
"మహీ ఓ లెజెండ్. మ్యాచ్ సమయంలో ఆయన మైదానంలోకి రాగానే ఎలాగైనా కలవాలని అనిపించింది. అందుకే కంచె దూకి మరీ మైదానంలో ఉన్న మహీ దగ్గరకు పరిగెత్తాను. ఆయన పాదాలను తాకాను. అప్పుడు ధోనీని చూడగానే నా కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. అప్పుడు ఆయన నాకున్న సమస్యను తెలుసుకున్నారు. ఎందుకంత వేగంగా ఊపిరి పీలుస్తున్నావ్ అని అడిగారు. అప్పుడు శ్వాస తీసుకోవడంలో నాకు ఇబ్బంది ఉందని చెప్పాను. అప్పుడు ఆయన నువ్వేమీ భయపడకు. నీ సర్జరీ బాధ్యత నాది అంటూ హామీతో పాటు ధైర్యాన్ని ఇచ్చారు." అని సదరు అభిమాని నాటి సంఘటనను గుర్తుచేసుకున్నాడు. ఇదంతా చెబుతూ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు.
కాగా, సదరు అభిమాని మహీ దగ్గరికి పరుగెత్తుకుని వెళ్లడంతో అక్కడున్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతడిని మహీకి దూరంగా తీసుకెళ్లారు. అప్పుడు ధోనీ అతడిని జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లండి అంటూ సిబ్బందిని కోరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. ఇది చూసిన క్రికెట్ ప్రియులు, నెటిజన్లు మహీ మంచి మనసుపై ప్రశంసలు కురిపించారు. ధోనీ మనసు చాలా గొప్పది, ఫ్యాన్స్ అంటే ధోనీకి ఎంతో గౌరవం. లవ్ యూ మహీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.