Sunrisers Hyderabad Impact Player Shahbaz Ahmed : ఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్‌లో పేలవ ప్రదర్శనతో పరాజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో క్వాలిఫయర్‌లో పుంజుకుని అదిరే ప్రదర్శన చేసింది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన రెండో క్వాలిఫయర్‌లో 36 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను ఓడించింది. దీంతో ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. దీంతో ఇప్పుడు తొలి క్వాలిఫయర్‌లో తమ ఓటమి రుచి చూపించిన కోల్‌కతాపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. అయితే ఈ రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ విజయానికి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.
ఈ సీజన్‌లోని చాలా మ్యాచ్‌లలో షాబాజ్ అహ్మద్ తుది జట్టులో ఆడాడు. కానీ అంతగా ప్రభావం చూపలేదు. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అతడు జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. 120/6తో ఉన్నదశలో బ్యాటింగ్‌కు దిగి 18 బంతుల్లో 18 పరుగులు సాధించాడు. బంతికో పరుగు చొప్పున చేస్తూ హెన్రిచ్ క్లాసెన్‌కు మంచి సహకారం అందించాడు. మరో వికెట్ పడకుండా ఆచితూడి ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. దీంతో మరో ఎండ్‌లో క్లాసెన్ వేగంగా పరుగులు చేయగలిగాడు.
ఇక స్పిన్‌కు బాగా సహకరించిన చెపాక్ పిచ్‌ను బాగా ఉపయోగించుకున్నాడు షాబాజ్ అహ్మద్. కీలకమైన మూడు వికెట్లు తీసి రాజస్థాన్‌ను గట్టిగా దెబ్బ కొట్టాడు. రాజస్థాన్ 65/1తో బలమైన స్థితిలో ఉన్న సమయంలో యశస్వి జైశ్వాల్‌ను(42) ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.రియాన్ పరాగ్‌తో(6) పాటు ఆర్ అశ్విన్‌ను(0) కూడా పెవిలియన్ చేర్చాడు. అలా తన నాలుగు ఓవర్ల కోటాలో 23 పరుగులు ఇచ్చి 3 వికెట్స్ పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.