India vs England 2nd T20I :ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. చెన్నై వేదికగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమ్ఇండియా 2 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (72* పరుగులు) అద్భుత హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్ 3, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, ఓవర్టన్, లివింగ్‌స్టోన్, ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ హాఫ్ సెంచరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చిన తిలక్ వర్మకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లో 165-9 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (45 పరుగులు; 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్. బ్రైడన్ కార్సే (31 పరుగులు; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), జేమీ స్మిత్ (22 పరుగులు; 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4 పరుగులు), బెన్ డకెట్ (4 పరుగులు) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. హ్యారీ బ్రూక్ (13 పరుగులు), లివింగ్‌స్టన్ (13 పరుగులు) ఆకట్టుకోలేకపోయారు చేశారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2, వరుణ్ చక్రవర్తి 2, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ సాధించారు.
కాగా, తాజా విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ఇండియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 మంగళవారం జరగనుంది. ఈ మ్యాచ్‌కు రాజ్‌కోట్ వేదిక కానుంది.