India vs Prime Ministers XI :ఆస్ట్రేలియా ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పింక్ బాల్‌తో జరిగిన ఈ మ్యాచ్‌ను 50 ఓవర్ల చొప్పున నిర్వహించాలనుకున్నారు. కానీ, మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం రావడం వల్ల 46 ఓవర్లకు కుదించారు.
ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 42.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇది ప్రాక్టీస్ మ్యాచ్ కాబట్టి మిగిలిన 3.1 ఓవర్లలో కూడా భారత్ బ్యాటింగ్ చేసింది. 46 ఓవర్లలో భారత్ 257/5 స్కోరు చేసింది. యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (50 రిటైర్డ్ హర్ట్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (45పరుగులు), కేఎల్ రాహుల్ (27 రిటైర్డ్ హర్ట్) శుభారంభం అందించారు. నితీశ్ కుమార్ రెడ్డి (42 పరుగులు), వాషింగ్టన్ సుందర్ (42* పరుగులు), రవీంద్ర జడేజా (27 పరుగులు) రాణించారు.
అదొక్కటే నిరాశ
ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశ పర్చాడు. 11 బంతులు ఎదుర్కొన్న రోహిత్ కేవలం మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు. చార్లీ అండర్సన్ బౌలింగ్‌లో క్యాచౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. పింక్ బాల్ టెస్టుకు ముందు రోహిత్ ఇలా స్వల్ప స్కోర్‌కే ఔట్ అవ్వడం ఆందోళన కలిగిస్తుంది. ఇక మరో స్టార్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగలేదు.