Chess Olympiad 2024 :2024 చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది. 45వ ఫిడే (FIDE) పోటీల్లో భారత పురుషుల జట్టు స్వర్ణం దక్కించుకుంది. పురుషుల జట్టు స్లొవేనియాతో జరిగిన 11వ రౌండ్‌లో డి. గుకేశ్, అర్జున్ ఇరిగేశీ, ప్రజ్ఞానంద తమ తమ గేమ్‌లను గెలుపొందారు. వ్లాదిమిర్ ఫెదోసీవ్‌ను గుకేశ్ ఓడించగా, జాన్ సుబెల్జ్‌పై ఇరిగేశీ, అంటన్ డెమ్చెంకోపై ప్రజ్ఞానంద విజయం సాధించారు.
అయితే టైటిల్ నేగ్గేందుకు పురుషుల జట్టు 11వ రౌండ్‌ను 'డ్రా' చేసుకున్నా సరిపోయేది. ఇప్పుడు మిగిలిన గేమ్‌లలో ఓడిపోయినా స్వర్ణం ఖాయమైంది. 45వ చెస్ ఒలింపియాడ్‌లో పురుషుల జట్టు తొలి ఎనిమిది రౌండ్‌లలో గెలిచి, తొమ్మిదో రౌండ్‌ను డ్రాగా ముగించింది. కీలకమైన పదో రౌండ్‌లో 2.5-1.5 తో బలమైన అమెరికాను మట్టికరిపించింది. చివరిదైన 11వ రౌండ్‌లో స్లొవేనియాపై పైచేయి సాధించింది.
మరోవైపు ఈ పోటీల్లో భారత మహిళల జట్టు కూడా తొలిసారి స్వర్ణంతో రికార్డు సృష్టించింది. 11వ రౌండ్‌లో 3.5-0.5 తో అజర్‌బైజాన్‌పై విజయం సాధించింది. డి. హారిక - దివ్య దేశ్‌ముఖ్ తమ తమ గేమ్‌లలో విజయం సాధించగా, ఆర్. వైశాలి గేమ్‌ను డ్రా గా ముగించింది. అనంతరం వంతిక అగర్వాల్ మరో అద్భుతమైన విజయాన్ని సాధించడం వల్ల మహిళల జట్టు విజయం ఖరారు చేసుకుంది. దీంతో భారత్ ఖాతాలో ఒకేసారి రెండు స్వర్ణాలు చేరాయి.