India vs Pakistan Documentary :క్రికెట్‌లో చిరకాల ప్రత్యర్థులు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది భారత్, పాకిస్థాన్ జట్లే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు క్రికెట్ అభిమానులు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతారు. మైదానంలో జరుగుతోంది మ్యాచా? లేక యుద్ధమా? అనే రితీలో విజయం కోసం పోరాటం సాగుతుంది. ఇరు జట్ల ఆటగాళ్లు విజయం కోసం తీవ్రంగా పరితపిస్తారు. ట్రోఫీ కంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడమే తమ లక్ష్యం అన్నట్లుగా తలపడతాయి. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే భారత్- పాక్ మధ్య చరిత్రాత్మక పోరును ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ రూపొందించింది.
భారత్- పాక్ క్రికెట్‌కు సంబంధించి ఈ డాక్యుమెంటరీని ఫిబ్రవరి 7న రిలీజ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టర్ విడుదల చేసింది. 'ది గ్రేటెస్ట్ రైవల్రీ : ఇండియా వర్సెస్ పాకిస్థాన్' పేరుతో ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంది.
'రెండు దేశాలు. ఒక అద్భుతమైన పోటీ. 160 కోట్ల మంది ప్రజల ప్రార్థనలు. ది గ్రేటెస్ట్ రైవల్రీ : ఇండియా వర్సెస్ పాకిస్థాన్. మరెక్కడా, ఎప్పుడూ ఇవ్వనంత ఓ గొప్ప థ్రిల్లింగ్ మ్యాచ్ ఫ్రిబ్రవరి 7న నెట్‌ఫ్లిక్స్‌లో ఆస్వాదించండి' అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చింది.