High Court Serious on HYDRA : ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలున్నాయంటూ ఈ నెల 10న నోటీసులు ఇచ్చి, తక్షణమే హైడ్రా చర్యలు చేపట్టడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జారీ చేసిన నోటీసులకు బాధితులు వివరణ ఇచ్చే దాకా కూడా ఆగకండా అంత హడావిడి ఎందుకని ప్రశ్నించింది. బాధితుల వివరణను తీసుకుని, దాన్ని 4 వారాల్లో పరిష్కరించి, తరువాత చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని హైడ్రాను ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా అల్మాస్‌గూడలో ఉన్న నిర్మాణాలను తొలగించాలంటూ ఈ నెల 10న ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ అంజిరెడ్డి సోమవారం హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి అనుమతించిన జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం మధ్యాహ్నం విచారణ చేపట్టారు. పిటిషనర్ వ్యవసాయ భూమి అని పాస్ బుక్ సహా అన్ని పత్రాలున్నాయని అంజిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పదేళ్ల క్రితం వరకు అక్కడ వ్యవసాయం చేసేవారని తెలిపారు. నీటి కొరత, వ్యవసాయ కూలీలు దొరకపోవడంతో వ్యవసాయం నిలిపివేశారన్నారు.
2012లో గ్రామ పంచాయతీ అనుమతులతో కొన్ని నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇచ్చినట్లు తెలిపారు. ఇంటి నెంబరు ఉందని, ఆస్తి పన్ను చెల్లిస్తున్నారని భూ వినియోగ మార్పిడి కూడా జరిగిందన్నారు. అయితే బడంగ్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని మీర్‌పేటలోని పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలున్నాయంటూ ఈ నెల 10న హైడ్రా నోటీసులు జారీ చేసిందన్నారు. దీనిపై వినతి పత్రం సమర్పించడానికి కార్యాలయానికి వెళ్లగా, ఎవరూ అందుబాటులో లేరన్నారు. సంక్రాంతి సెలవులను కూడా దృష్టిలో పెట్టుకోకుండా వివరణకు అవకాశం ఇవ్వలేదన్నారు.
వాదనలను విన్న న్యాయమూర్తి హైడ్రా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంత హడావడిగా కూల్చివేతలు చేపట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. నోటీసుకు వివరణ ఇవ్వడానికి ఈ నెల 17వ తేదీ వరకు పిటిషనర్‌కు గడువు ఇవ్వాలని హైడ్రాను ఆదేశించారు. పిటిషనర్ సమర్పించిన వినతి పత్రాన్ని 4 వారాల్లో పరిష్కరించి నిర్ణయం వెలువరించాక చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నోటీసులిచ్చి 24 గంటలు గడవలేదు, వారి వివరణ తీసుకోలేదు - హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం
ఫిర్యాదులకు మూడు వారాల్లో పరిష్కారం చూపిస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్