India Vs Australia Border Gavaskar Trophy 2024 :న్యూజిలాండ్‌తో జరిగిన పోరు వల్ల ఒత్తిడిలో ఉన్న టీమ్‌ఇండియా ఇప్పుడు బోర్డర్-గావస్కర్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో మరికొద్ది సేపట్లో తొలి టెస్టు ఆడనుంది. అయితే ఆసీస్‌లో గత రెండు సిరీస్‌లు గెలిచినా కూడా భారత్ ఎలాంటి అంచనాలు లేకుండానే ఈ సారి బరిలోకి దిగుతోంది. స్వదేశంలో, అనుకూల పరిస్థితుల్లో ఆడనున్న ఆస్ట్రేలియాను ఓడించడం మన జట్టుకు పెను సవాలనే చెప్పాలి. అయితే కంగారూ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది భారత జట్టు. రోహిత్ గైర్హాజరీలో ఈ మ్యాచ్‌లో భారత్‌కు బుమ్రా నాయకత్వం వహిస్తున్నాడు.
ప్రతికూలతలను అధిగమించేనా :
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురికావడం టీమ్‌ఇండియాకు పెద్ద షాక్. అది జట్టు నైతిక స్థైరాన్ని దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. అసలే పేలవ ఫామ్‌తో సతమతమవుతోన్న భారత్‌కు రోహిత్ గైర్హాజరీ (తొలి టెస్టుకు), కీలక పేసర్ షమి లేకపోవడం, గాయంతో గిల్ ఈ మ్యాచ్‌కు దూరంగా కావడం పెద్ద ఎదురుదెబ్బ. జట్టులో అనుభవం కూడా తక్కువే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డున్న సీనియర్ బ్యాటర్ కింగ్ కోహ్లిపై పెద్ద బాధ్యతే ఉంది. కానీ పరుగుల వేటలో ఈ ఏడాది అతడి రికార్డేమీ బాగాలేదు. 2024లో 10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 22.72 సగటుతో పరుగులు చేశాడు. బహుశా ఆసీస్‌లో చివరి టెస్టు సిరీస్ ఆడుతోన్న కోహ్లి ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరం.