All Time 11 India:టీమ్ఇండియా మాజీ ప్లేయర్ దినేశ్ కార్తీక్ తన ఆల్‌టైమ్ భారత జట్టును ప్రకటించాడు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అన్ని ఫార్మాట్లలో కలిపి దినేశ్ 11మంది ప్లేయర్లతో తన జట్టును వెల్లడించాడు. అయితే డీకే ప్రకటించిన జట్టులో మాజీ కెప్టెన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మాత్రం చోటు దక్కకపోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఉన్న టీమ్ఇండియా సీనియర్ జట్టులోంచి మాత్రం ఐదుగురిని ఎంపిక చేశాడు. అలాగే 12వ ఆటగాడిగా స్పిన్ దిగ్గజం హర్భజన్‌ను తీసుకున్నాడు.
కానీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎవరన్నది మాత్రం ప్రస్తావించలేదు. ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ ఆ తర్వాత వరుసగా రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజాకు ఆల్‌రౌండర్లుగా జట్టులో స్థానం కల్పించాడు. స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లేను ఎంచుకోగా, పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్ ఉన్నారు.
'జట్టులో ఇద్దరు ఆల్‌రౌండర్లు ఉండాలి. అందుకే సారూప్యతలున్న ఇద్దరిని తీసుకున్నా. 12వ ఆటగాడు హర్భజన్. గంభీర్ లాంటి ఇంకా చాలా మంది ఆటగాళ్లున్నారు. కానీ అందరిని 11 మంది జట్టులో సర్దుబాటు చేయడం కష్టం. కాబట్టి అన్ని ఫార్మాట్లలో కలిపి ఇదే నా అత్యుత్తమ ఎలెవన్' అని కార్తీక్ పేర్కొన్నాడు.