Ind vs SL 2nd T20 2024:భారత్- శ్రీలంక మధ్య రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు ఇన్నింగ్స్ ఆరంభంలోనే వర్షం ఆటకం కలిగించింది. దీంతో ఆటను 8 ఓవర్లకు కుదించారు. డక్వర్త్ లూయిస్ ప్రకారం 8 ఓవర్లలో టీమ్ఇండియా లక్ష్యాన్ని 78 పరుగులుగా నిర్దేశించారు. దీంతో ఈ వర్ష ప్రభావిత రెండో టీ20లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్ (15 బంతుల్లో 30; 3×4, 2×6), సూర్యకుమార్ యాదవ్ (12 బంతుల్లో 26; 4×4, 1×6), హార్దిక్ పాండ్య (22 నాటౌట్; 9 బంతుల్లో 3×4, 1×6) చెలరేగడం వల్ల భారత్ 6.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గిల్ స్థానంలో ఈ మ్యాచ్‌కు సంజు (0) అవకాశం దక్కించుకున్నాడు. కానీ అతడు రాణించలేదు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్లలో కుశాల్ మెండీస్ (10 పరుగులు) విఫలమైనా, పాతుమ్ నిస్సంక (32 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. కుశాల్ పెరీర (53 పరుగుుల) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కామిందు మెండీస్ (26 పరుగులు), చరిత్ అసలంక (14 పరుగులు), దాసున్ షనక (0), వానిదు హసరంగ (0), రమేశ్ మెండీస్ (12 పరుగులు), మహీష్ తీక్షణ (2) ఆకట్టుకోలేదు. టీమ్ఇండియా బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.
అయితే 15ఓవర్లకు శ్రీలంక 130-2తో పటిష్ఠమైన స్థితిలో నిలిచింది. ఈ దశలో లంక స్కోర్ 200 దాటడం పెద్ద కష్టమేమీ కాదనున్నారంతా. కానీ, అప్పుడే టీమ్ఇండియా బౌలర్ల విజృంబన ప్రారంభమైంది. 15.1 వద్ద హార్దిక్ పాండ్య భారత్కు బ్రేక్ ఇచ్చాడు. కామిందు మెండీన్ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత లంక బ్యాటింగ్ ఆర్డర్లో 30 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు టపటపా కూలాయి. ఇకపోతే సిరీస్‌లో చివరిదైన మూడో టీ20 మంగళవారం జరుగుతుంది.