Ind vs Pak T20 World Cup:2024 టీ20 వరల్డ్‌కప్‌కు ఐసీసీ సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ, మైదానాల పనుల్లో వేగం పెంచింది. ఈ క్రమంలోనే రీసెంట్గా న్యూయార్క్‌లోని నసావు క్రికెట్ స్టేడియంలో పిచ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇదే గ్రౌండ్లో జూన్ 9న భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.
ఈ నేపధ్యంలో స్టేడియం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. సాధారణ స్టేడియాల కంటే ఈ గ్రౌండ్లో బౌండరీ లైన్ చాలా దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. పిచ్ నుంచి నలువైపులా 65- 70 మీటర్లకు కొంచెం అటు ఇటుగా బౌండరీ లైన్ ఉన్నట్లు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు భారత్‌లో ఉన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కంటే ఇది తక్కువ దూరం. దీంతో ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో భారీ స్కోర్లు ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ మైదానంలో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శివమ్ దూబే ఏకంగా స్పిన్నర్లపై దండయాత్ర చేస్తాడని, బంతి స్టేడియం బయట పడడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇక ఈస్టేడియంలో డ్రాప్- ఇన్ వికెట్ పిచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 10 పిచ్‌లను రీసెంట్గా ఫ్లోరిడా నుంచి న్యూయార్క్‌కు 20 ట్రక్కుల ద్వారా తీసుకొచ్చారు. స్టేడియం మధ్యలో నాలుగు పిచ్‌లు ఉంచనునున్నట్లు ఐసీసీ తెలిపింది. కాగా, ఈ స్టేడియం న్యూయార్క్ ఈస్ట్మేడ్లోని ఐసెన్‌హోవర్ పార్క్‌లో నిర్మిస్తున్నారు.