Devotees Facing Problems At Chervugattu Temple : నల్గొండ జిల్లాలోని చెర్వుగట్టులోని పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గుహాలయానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. గుట్టపైకి వెళ్లే ఘాట్ రోడ్డు ఇరుకుగా ఉండడంతో భారీ వాహనాలు, కార్లతో పాటు ఇతర వాహనాల్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఫిబ్రవరి 2 నుంచి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతుండటంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు ముఖ్య రోజుల్లో ఘాట్ రోడ్డు నుంచి కొండపైకి వచ్చే భక్తుల వాహనాలను అనుమతించడం లేదు. వృద్ధులు, చిన్నారులు ఘాట్‌రోడ్డుపై కాలి నడకన వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
చిన్నపిల్లలతో కష్టంగా మారింది : శివుడు తమ ఇష్ట దైవమని, కుటుంబ సభ్యులతో కలిసి చెర్వుగట్టును సందర్శిస్తుంటామని బోయపల్లి శ్రవణ్ కుమార్ అనే భక్తుడు తెలిపారు. టోల్ గేట్ వద్ద 50రూపాయలు చెల్లించి కొండపైకి చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్కింగ్ స్థలం సరిగా లేకపోవడంతో కారును దూరంగా నిలిపి కాలినడకనే వెళుతున్నామని ఆయన వివరించారు. సామగ్రి, చిన్నపిల్లలు, అమ్మానాన్నలతో గుట్టపైకి ఎక్కడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘాట్ రోడ్డు సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
"ప్రతి సోమవారం, పండుగ రోజుల్లో పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దర్శించుకునేందుకు వస్తున్నాం. అమావాస్య రోజు మా వాహనాలు చెర్వుగట్టుకు వచ్చే మార్గంలోనే నిలిపివేస్తున్నారు. దీంతో ప్రైవేట్ ఆటోల్లో డబ్బులు చెల్లించి కొండపైకి వెళ్తున్నాం. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఘాట్ రోడ్డు సమస్యకు పరిష్కారం చూపాలి"- పుల్లంల రమేష్, భక్తుడు
'ఘాట్ రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అందు కారణంగానే వాహనాలను అనుమతించడం లేదని, సమస్య పరిష్కారానికి రూ.33 కోట్లతో ప్రతిపాదనలు పంపామని చెర్వుగట్టు ఈవో నవీన్‌కుమార్ తెలిపారు.
యాదాద్రికి బస్సు సౌకర్యం లేక భక్తుల ఇబ్బందులు - గంటల తరబడి నిరీక్షణ
యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ.. తొలిసారిగా తిరుమల తరహాలో ఏర్పాట్లు