Wild Buffalo Die : గత మూడు రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అటవీ శాఖ అధికారులకు ముచ్చెమటలు పట్టించిన అడవి దున్న ఇవాళ మృతి చెందింది. అడవి దున్న ఆత్మకూర్, చౌటుప్పల్, వలిగొండ, భువనగిరి మండలాల్లోని పంట పొలాల్లో తిరుగుతూ ఆయా గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. ఇవాళ మధ్యాహ్నం భువనగిరి మండలం రెడ్డి నాయక్ తండా శివారులోని గుట్టల పైన అడవి దున్న అధికారులకు కనిపించడంతో వారు దాన్ని పట్టుకునేందుకు గన్నుతో మత్తు ఇంజెక్షన్‌ను ఇచ్చారు. అదే మత్తులో దున్న రెండు గుట్టలు ఎక్కి దిగడంతో స్పృహ తప్పి కింద పడిపోయి మృతి చెందింది. ఈ విషయాన్ని జిల్లా అటవీ అధికారులు స్పష్టం చేశారు.
కాగా అడవి దున్నకు అధికారులు మత్తు ఎక్కువగా ఇవ్వడంతోనే మృతి చెందినట్లు జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు మత్తు మోతాదుకు మించి ఇవ్వడం వల్లే మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సురక్షితంగా అడవి దున్నను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేయాల్సిన అధికారులు ఇలా చంపడం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
మూడు రోజుల క్రితం అడవి దున్న హల్‌చల్ : గత కొన్ని రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అడవి దున్న హల్‌చల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. జిల్లాలోని పలు మండలాల్లో ప్రత్యక్షమవుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. ఈ క్రమంలో స్థానికులు అడవి శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయినా వారు అడవి దున్నను పట్టుకోవడంలో విఫలం అయ్యారు. మూడు రోజుల క్రితం ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామ శివారులో కనిపించిన అడవి దున్న, గురువారం చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామ శివారులో కనిపించింది.
గురువారం రాత్రి వలిగొండ మండలం సంగెం గ్రామ శివారులో పొలాల మధ్య తిరుగుతూ స్థానికులకు కనిపించింది. 3 రోజులుగా అటవీ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అడవి దున్నను పట్టుకోలేకపోయారు. చివరకు ఇవాళ దున్నను పట్టుకునే క్రమంలో మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో కాసేపు అటూఇటూ తిరుగుతూ మృతి చెందింది. ఈ విషయంపై స్థానికులు, జంతు ప్రేమికులు అటవీ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాయల్ బంగాల్ టైగర్‌ను చంపిన అటవీ సిబ్బంది.. ఎందుకంటే?
బావిలో పడ్డ భారీ అడవి దున్న.. మత్తుమందు ఇచ్చి.. క్రేన్ సహాయంతో..