Story Behind Washington Sundar Name :న్యూజిలాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ పేరు మార్మోగిపోతోంది. అనుహ్యంగా ఈ సిరీస్‌కు ఎంపికైన అతడు తుది జట్టులోనూ చోటు దక్కించుకుని తన స్పిన్ మ్యాజిక్‌తో ఆకట్టుకుంటున్నాడు. దాదాపు 45 నెలల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న సుందర్ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు.
మొత్తంగా 23.1 ఓవర్లు బంతిని సంధించి ఏకంగా ఏడు వికెట్లు తీశాడు. తన స్పెల్‌లో 59 పరుగులు మాత్రమే సమర్పించుకుని నాలుగు మెయిడిన్లు చేశాడు. ఏకంగా ఐదుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేసేశాడు. దీంతో సుందర్ దెబ్బకు ప్రత్యర్థి జట్టు కివీస్ 259 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇప్పుడు భారత క్రికెట్లో సుందర్ పేరు బాగా వినిపిస్తోంది.
'వాషింగ్టన్' పేరు ఎలా వచ్చిందంటే? -సుందర్ పేరు, వాషింగ్టన్ సుందర్. అయితే అసలు ఆ వాషింగ్టన్ అనేది ఎందుకు ఉందో చాలా మందికి తెలిసి ఉండదు. వాషింగ్టన్ సుందర్ తండ్రి పేరు మణి సుందర్. ఒకప్పుడు ఆయన రంజీ ప్లేయర్. అయితే ఆయనది నిరుపేద కుటుంబం. కానీ మణి సుందర్‌కు క్రీడలంటే చాలా ఇష్టం. ఆ సమయంలో పీ.డీ. వాషింగ్టన్ అనే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మణి సుందర్‌కు అండగా నిలిచారు. చిన్నతనంలో క్రికెట్ ఆడేందుకు ఆర్థికంగా సాయం చేశారు. చదువుకు అయ్యే ఖర్చును భరించారు. దీంతో ఆ మాజీ అధికారి అంటే మణి సందుర్కు ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే తన కుమారుడికి వాషింగ్టన్ అనే పేరు పెట్టారు మణి సుందర్.