IND vs ENG Test Series 2024 : గాయాలతో రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమైన నేపథ్యంలో వారి స్థానంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ టెస్టు కోసం యూపీ ఆల్ రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్, ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌లను ఎంపిక చేసింది. అయితే, ఇప్పుడు కేఎల్ రాహుల్ స్థానంలో ఎవరు ఆడతారు అనేది అందరిలో ఆసక్తిరేపుతున్న అంశం. ఈ స్థానం కోసం రజత్ పటీదార్, సర్పరాజ్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
అవకాశం ఎవరికి?
ఇప్పటికే కోహ్లి గైర్హాజరీతో రజత్ పటీదార్ 15 మంది సభ్యుల జట్టులో స్థానం సంపాదించాడు. రాహుల్ జడేజా దూరమయ్యాక ముగ్గురు ఆటగాళ్లు వచ్చారు. సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ ఆటగాళ్లిద్దరూ అరంగేట్రంపై ఆశలతో ఉన్నారు. వారిలో రాహుల్ స్థానంలో ఆడే అవకాశం ఎవరికి లభిస్తుందన్నది ప్రశ్న. మరోవైపు అయితే ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం అంటే కష్టమేనని టీమ్‌ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ అంటున్నారు.
"సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ ఇద్దరూ చాలా మంచి ఆటగాళ్లు. గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో వాళ్లెంత బాగా ఆడుతున్నారో చూస్తున్నాం. ఇలాంటి పిచ్‌లపై ఆ బ్యాటర్లు జట్టుకు ఎంతో విలువను చేకూరుస్తారు. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సివస్తే అది కష్టమైన పనే. దీనిపై రాహుల్ ద్రవిడ్, రోహిత్ నిర్ణయం తీసుకుంటారు"
- విక్రమ్ రాఠోడ్, టీమ్‌ఇండియా బ్యాటింగ్ కోచ్