Ind vs Aus T20 World cup 2024 :2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ అంతిమ సమరం, నిరుడు వన్డే వరల్డ్ కప్ తుది పోరు ఇంకా చాలా ఐసీసీ టోర్నమెంట్లలో టీమ్ఇండియాను ఓడించిన కంగారులు, ఇప్పుడు మనోళ్ల చేతిలో ఓటమిని చూశారు. వారి సెమీస్ అవకాశాలను దెబ్బ కొడుతూ రోహిత్ సేన ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు దూసుకెళ్తోంది.
తాజాగా జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా - భారత్ తలపడ్డాయి. ఈ పోరులో బ్యాటుతో, బంతితో ఆధిపత్యం చెలాయించిన టీమ్‌ఇండియా ఆసీస్ టీమ్‌ను 24 పరుగుల తేడాతో ఓడించి సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. దీంతో కంగారుల భవితవ్యం అఫ్గానిస్థాన్ - బంగ్లాదేశ్ రిజల్ట్‌పై ఆధారపడి ఉంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ (0) మరోసారి నిరాశపర్చినా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మ (92; 41 బంతుల్లో 7×4, 8×6) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య కుమార్ (31; 16 బంతుల్లో 3×4, 2×6), శివమ్ దూబె (28; 22 బంతుల్లో 2×4, 1×6), హార్దిక్ పాండ్య (27 నాటౌట్; 17 బంతుల్లో 1×4, 2×6) మెరుపులు మెరిపించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, స్టోయినిస్ చెరో 2, హేజిల్‌వుడ్ 1 వికెట్ దక్కించుకున్నారు.