Champions Trophy Shoaib Akhtar: 2025 ఛాంపియన్స్ ట్రోఫీపై కొనసాగుతున్న సస్పెన్స్‌పై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ఇటీవల జరిగిన ఐసీసీ మీటింగ్‌లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించినట్లు తెలిసింది. అయితే దీని గురించి అధికారికంగా వార్తలు రాకముందే పీసీబీ హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించిందని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే పీసీబీ తీసుకున్న ఓ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఈ మేరకు ఓ టీవీ ఛానెల్ డిబేట్లో షోయబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీపై పీసీబీ తమ వైఖరి మార్చుకొని భారత్ మ్యాచ్‌లను తటస్థ వేదికగా నిర్వహించేందుకు ఓకే చెప్పింది. అయితే దీనికి పీసీబీ కొన్ని షరతులు విధించింది. భవిష్యత్‌లో భారత్ ఆతిథ్యమిచ్చే అన్ని టోర్నీల్లో పాకిస్థాన్ మ్యాచ్‌లనూ తటస్థ వేదికల్లోనే నిర్వహించాలని కండీషన్ పెట్టింది. అయితే ఈ నిర్ణయాన్ని షోయబ్ తప్పుబట్టాడు. భారత్‌కు వెళ్లి అక్కడే టీమ్ఇండియాను ఓడించాలని పేర్కొన్నాడు.