Hanuma Vihari Left Andhra Team: టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రంజీ ట్రోఫీలో ఇకపై ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించేది లేదని తేల్చి చేప్పాడు. 2024 రంజీ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్స్‌లో ఆంధ్రా జట్టు ఓడిన తర్వాత విహారి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించాడు.
'2024 రంజీలో బంగాల్‌తో మ్యాచ్‌లో ఆంధ్రా జట్టుకు నేను కెప్టెన్‌గా వ్యవహరించాను. ఆటలో భాగంగానే నేను ఆ మ్యాచ్‌లో ఓ ప్లేయర్ (17వ ఆటగాడు)పై అరిచాను. అతడు తన తండ్రికి నాపై ఫిర్యాదు చేశాడు. ఆయన ఓ రాజకీయ నాయకుడు. నాపై చర్యలు తీసుకోవాలని ఆయన అసోసియేషన్‌ను కోరాడు. ఆ మ్యాచ్‌లో 410 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి జట్టను గెలిపించినప్పటికీ, కెప్టెన్సీ నుంచి వైదొలగాలని అసోసియేషన్ నన్ను కోరింది. ఆట పరంగా నా తప్పు లేకున్నా కెప్టెన్సీకి రాజీనామా చేయమనడం బాధేసింది. జట్టుపై ఉన్న గౌరవంతోనే నేను ఇప్పటివరకు టోర్నీలో ఆడాను. నాకు టీమ్ అంటే ఎంతో ప్రేమ. ప్రతి సీజన్లో మేము మెరుగుపడుతూ ఎదుగుతున్నాం. కానీ, అసోసియేషన్‌కు మేం ఎదగడం ఇష్టం లేనట్లుంది' అని విహారి సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
'నేను ఆ ప్లేయర్‌ను వ్యక్తిగతంగా ఏమీ అనలేదు. అయితే గత ఏడేళ్లలో ఐదుసార్లు జట్టును నాకౌట్ చేర్చి, టీమ్ఇండియాకు 16 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన వాళ్ల (విహారి)కంటే అసోసియేషన్‌కు ఆ ప్లేయర్ (రాజకీయ నాయకుడి కుమారుడు) ఎక్కువైపోయాడు. అసోసియేషన్ చెప్పినట్లు ప్లేయర్ నడుచుకోవాలని, వారివల్లే మేం ఇక్కడ ఉన్నామని భావిస్తున్నారు' అని విహారి పేర్కొన్నాడు.
ఇక గతేడాది రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో తను గాయపడినప్పటికీ ఎడమ చేతితో బ్యాటింగ్ చేసిన సందర్భాన్ని విహారి గుర్తు చేసుకున్నాడు. జట్టు కోసం ఎంతో చేసినప్పటికీ అసోసియేషన్ ఇలా వ్యవహరించడం నచ్చలేదని విహారి అన్నాడు. ఆత్మ గౌరవాన్ని చంపుకొని జట్టులో కొనసాగలేనని విహారి చెప్పాడు. అయితే తొలుత వ్యక్తిగత కారణాల వల్ల కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పిన విహారి, తాజాగా అసోసియేషన్ కోరడం వల్లే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నానని ఆరోపించడంతో ఈ విషయం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది.