Joe Root Test Record:ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ప్రస్తుతం టెస్టుల్లో జోరుమీదున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్లో స్థిరంగా రాణిస్తూ ఇటీవల కాలంలో సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో దూసుకుపోతున్నాడు. రెండో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలతో సత్తా చాటాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అతడి సెంచరీల సంఖ్య 34కు చేరింది. దీంతో టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డు కొట్టాడు. ఇదివరకు ఈ రికార్డు మాజీ ప్లేయర్ ఆలిస్టర్ కుక్ (33) పేరిట ఉండేది.
ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ టెస్టు రికార్డులవైపు ఒక్కో అడుగు వేస్తూ ముందుగు కదులుతున్నాడు. దీంతో టెస్టుల్లో సచిన్ రికార్డులు రూట్ బ్రేక్ టేసే ఛాన్స్‌లు ఉన్నాయంటూ పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ప్లేయర్ అలిస్టర్ తాజాగా కుక్ జో రూట్ ను ఇంటర్వ్యూ చేశాడు. అందులో జో రూట్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. అవేంటంటే?
'కుక్ కెప్టెన్సీలో మొదటి టెస్టు ఆడడం నా కల'
తాను టెస్టుల్లో అరంగేట్రం అలిస్టర్ కుక్ కెప్టెన్సీలోనే చేశానని జో రూట్ ఇంటర్వ్యూలో తెలిపాడు. అదొక వైల్డ్ రైడ్ అని, కుక్ కెప్టెన్సీలో మొదటి మ్యాచ్ ఆడడం తన కల అని చెప్పుకొచ్చాడు. టీమ్ఇండియాపై రూట్ సాధించిన 10, 31వ సెంచరీ గురించి కుక్ ప్రస్తావించాడు. రాంచీలో రూట్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ ప్రత్యేకమైనదని కుక్ వ్యాఖ్యానించాడు. అందుకు బదులుగా రూట్, కేవలం రికార్డుల కోసం తాను ఆడట్లేదని పేర్కొన్నాడు. ప్రతి పరుగుకు ఒక కథ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ టీమ్ ఎప్పుడూ తనకు మద్దతు ఇస్తుందని అన్నాడు.
కుక్ ప్రశ్న: రూట్ మీరు ఇంగ్లాండ్ కెప్టెన్, బ్యాటర్‌గా డ్యూయల్ రోల్ ఎలా నిర్వహిస్తారు?
రూట్ జవాబు: అవును అది సవాల్‌తో కూడుకున్న విషయమే. అది ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. టీమ్‌కు ధైర్యాన్ని ఇవ్వాలి. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా తదుపరి బంతిపై దృష్టి పెట్టాలి.