Dc vs UPW WPL 2024:2024 డబ్ల్యూపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. సోమవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో నెగ్గింది. యూపీ నిర్దేశించిన 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దిల్లీ 14.3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (64* పరుగులు), మెగ్ లానింగ్ (51 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎక్సెస్స్టోన్ ఒక వికెట్ దక్కించుకుంది. ఇక అద్భుత బౌలింగ్ స్కిల్స్‌తో యూపీ టాపార్డర్‌ను కూల్చిన మారిజాన్ కాప్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' లభించింది.
స్వల్ప లక్ష్య ఛేదనను దిల్లీ ఇన్నింగ్స్ ఘనంగా ఆరంభించింది. ఓపెనర్లు లానింగ్, షఫాలీ పోటాపోటీగా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. యూపీ బౌలర్లలకు ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా స్వేచ్ఛగా పరుగులు సాధించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 119 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నారు. ఇక 14.2 ఓవర్ వద్ద సోఫీ మెగ్ లానింగ్‌ను పెవిలియన్ చేర్చింది. కానీ, అప్పటికే దిల్లీ విజయం దాదాపు ఖరారైంది. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ ఫోర్‌తో మ్యాచ్ ముగించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. శ్వేత సెహ్రవత్ (45 పరుగులు) మినహా ఎవరూ రాణించలేదు. దిల్లీ బౌలర్ల జోరుకు యూపీ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే క్రమంగా వికెట్లు కోల్పోయింది. దిల్లీ బౌలర్లలో రాధా యాదవ్ 4, మారిజాన్ కాప్ 3, అరుంధతి రెడ్డి, సుధర్లాండ్ తలో వికెట్ దక్కించుకున్నారు.