Danielle Wyatt Joins RCB WPL : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి పదేళ్ల క్రితం ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జట్టులోకి తీసుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ మహిళల జట్టులో ఈమెకు చోటు దక్కింది.
అంతకుముందు డేనియల్ వ్యాట్ డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహించింది. అయితే ఇప్పుడు ట్రేడింగ్‌లో ఆర్సీబీ ఆమెను దక్కించుకుంది. ఇప్పటి వరకు యూపీ వారియర్స్ చెల్లించిన రూ.30 లక్షలనే, ఆర్సీబీ కూడా ఆమెకు చెల్లించనుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.
ఇదే విషయాన్ని డబ్ల్యూపీఎల్ కూడా తెలిపింది. "వాస్తవానికి వేలంలో యూపీ వారియర్స్ ఆమెను రూ.30 లక్షలకు దక్కించుకుంది. అయితే వ్యాట్ ఆర్సీబీకి బదిలీ కానుంది. ఆర్సీబీ జట్టుకు వ్యాట్ తన అనుభవాన్ని ఇవ్వనుంది. ఇప్పటికే ఆమె ఇంగ్లాండ్ తరఫున 164 అంతర్జాతీయ టీ20లు ఆడింది. టీ20 ఫార్మాట్లో ఏ ఇంగ్లీష్ ప్లేయర్ కూడా ఇన్ని అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. " అని డబ్ల్యూపీఎల్ రాసుకొచ్చింది.