CSK vs GT 2024 IPL :2024 ఐపీఎల్లో మంగళవారం (మార్చి 26) చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ పోరులో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది సీఎస్కే. 63 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. యంగ్ బ్యాటర్ శివమ్ దూబే మెరుపు హాఫ్ సెంచరీ (51 పరుగులు, 23 బంతుల్లో: 2x4, 5x6)తో అదరగొట్టగా, రచిన్ రవీంద్ర (46 పరుగులు, 20 బంతుల్లో: 6x4, 3x6) దూకుడు ప్రదర్శించాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (46 పరుగులు) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.
రెచ్చిపోయిన రచిన్, దూబే: చెన్నై ఇన్నింగ్స్‌లో రచిన్, దూబే మెరుపులతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ ఏకంగా 200+ స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించారు. తొలుత క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర బౌండరీలతో విరుచుకు పడటంతో చెన్నై ఐదు ఓవర్లకే 58 పరుగులు చేసింది. ఓ ఎండ్‌లో రుతురాజ్ నిలకడగా ఆడుతుంటే, రచిన్ రవీంద్ర ఎదురు దాడికి దిగాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు.
అయితే పవర్ ప్లే లాస్ట్ ఓవర్‌లో గిల్, రషీద్ ఖాన్‌కి బాల్ ఇచ్చాడు. మొదటి బాల్‌నే బౌండరీకి తరలించిన రచిన్ రవీంద్ర, ఆ తర్వాత బాల్‌కే స్టంప్ అవుట్ అయ్యాడు. ఇక మిడిలార్డర్లో వచ్చిన దూబే సైతం గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.